24 గంటల్లో పెళ్లి.. ఇంతలో వధువు ఆత్మహత్య 

3 May, 2022 03:37 IST|Sakshi
భీమేశ్వరి 

ఓ యుకువడి వేధింపులు తాళలేక ఉరేసుకొని బలవన్మరణం 

తన చావుకు అతడే కారణమంటూ సూసైడ్‌ లెటర్‌ రాసిన యువతి  

నారాయణపేట జిల్లా చందాపూర్‌లో విషాదం

మక్తల్‌: తెల్లారితే బాజాభజంత్రీలు మోగాల్సిన ఇల్లు. మరో 24 గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే వధువు ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడి వేధింపులు తాళలేక ఉరేసుకుంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్‌లో ఈ ఘటన జరిగింది. చందాపూర్‌ వాసి భీమేశ్వరి (19)కి మక్తల్‌ మండలం దండుకు చెందిన ఓ యువకుడితో వారం రోజుల క్రితం నిశ్చితార్థమైంది.

ఈనెల 3న ఉదయం 9.55 గంటలకు వరుడి ఇంట్లో పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఇదిలా ఉండగా చందాపూర్‌కు చెందిన నర్సిములు (లిక్కి) కొన్నాళ్లుగా ప్రేమ పేరిట భీమేశ్వరిని వేధించసాగాడు. ‘నీకు వేరే వ్యక్తితో పెళ్లి కాకముందే ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకుంటా’నని తరచూ బెదిరించేవాడు. ఆ బాధ ఎవరితోనూ చెప్పుకోలేక ఆ యువతి సోమవారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరేసుకుని చనిపోయింది.

లిక్కి వేధింపులు తాళలేక పెళ్లికి ముందే నేను చనిపోతున్నాను అని సూసైడ్‌ లెటర్‌ రాసింది. ఉదయం విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పద్మమ్మ, వెంకటప్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్సై రాములు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం చేసి యువతి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సాయంత్రం కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ‘అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి బదులు మట్టి వేయాల్సి వచ్చింది’అంటూ కుటుంబీకులు, బం ధువులు, స్నేహితులు కన్నీరు మున్నీరయ్యారు.


మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకెళ్లండి..
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు