ఐదు రోజుల్లో పెళ్లి.. అంతలోనే ఘోరం

29 Aug, 2021 10:10 IST|Sakshi
పెళ్లి కూతురు చైతన్య

ఒక్కగానొక్క కూతురు..  గారాబంగా పెరిగింది..  బంధుత్వంలోనే సంబంధం కుదిరింది..  భాగస్వామితో జీవితం తలచుకుని  ఎన్నో కలలు కనింది.. ఐదు రోజుల్లో పెళ్లి..ఇల్లంతా సందడి..  లాంఛనాలిచ్చేందుకు వరుడి ఇంటికి తానూ వస్తానంటూ తండ్రితో కలిసి పయనమైంది.. అదే ‘చివరి పయనం’ అవుతుందని  ఊహించలేకపోయింది. 

హిందూపురం/పరిగి:  హిందూపురం సమీపంలోని మోత్కుపల్లి బ్రిడ్జి వద్ద శనివారం ద్విచక్ర వాహనాన్ని సిమెంట్‌ లారీ ఢీ కొనడంతో ఐదు రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువతి అర్ధంతరంగా తనువు చాలించింది. ఆమె తండ్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల మేరకు.. హిందూపురం మండలం సంతేబిదనూరు గ్రామానికి చెందిన నరసింహమూర్తి,   గంగరత్నమ్మల కుమార్తె చైతన్య(21)కు పరిగి మండలం బీచిగానిపల్లికి చెందిన బంధువుల అబ్బాయితో పెళ్లి కుదిరింది.

 చైతన్య డిగ్రీ పూర్తి చేసింది. ఒక్కగానొక్క కుమార్తె కావడంతో వివాహం వైభవంగా చేయాలని తల్లిదండ్రులు భావించారు. వరుడు కూడా సమీప బంధువే కావడంతో అతని ఇంటి వద్దే సెపె్టంబరు రెండున వివాహ వేడుక జరిపించాలని నిర్ణయించారు. పెళ్లి రోజు సమీపిస్తుండడంతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బంధువులందరికీ పత్రికలు పంచారు. పెళ్లి కుమార్తెకు కొత్త దుస్తులు కొన్నారు. వరుడికి పెళ్లి లాంఛనాలు, దుస్తులు ఇవ్వడంతో పాటు బీచిగానిపల్లిలోనే ఉన్న బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు శనివారం నరసింహమూర్తి బయలుదేరాడు. తానూ వస్తానంటూ చైతన్య కూడా తండ్రి బైక్‌పై పయనమైంది. మోత్కుపల్లి బ్రిడ్జిపై వెళుతుండగా వెనుక నుంచి సిమెంట్‌ లారీ (ఏపీ 04బీడబ్ల్యూ7462) వేగంగా ఢీకొట్టింది.

తండ్రీ కూతురు కింద పడిపోగా.. లారీ టైర్లు చైతన్య పైనుంచి వెAళ్లాయి. దీంతో కాళ్లు రెండూ నుజ్జునుజ్జయ్యాయి. అరగంట పాటు నరకం చూసింది. నరసింహమూర్తికీ తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానికులు హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే చైతన్య చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నరసింహమూర్తిని మెరుగైన వైద్యం కోసం    బెంగళూరుకు తరలించారు. హిందూపురం   వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం   చేసుకున్నారు. బాగేపల్లికి చెందిన లారీ డ్రైవర్‌ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.   

చదవండి: కులం నుంచి వెలివేశారని వస్తే.. ఎస్సై బూతులు తిట్టారు..

మరిన్ని వార్తలు