నాలుగు నెలల క్రితం వివాహం.. నవవధువు..

29 Sep, 2022 08:05 IST|Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌ (హైదరాబాద్‌): అనుమానాస్పద స్థితిలో ఓ నవవధువు ప్యాన్‌కు చీరతో ఉరి వేసుకొని  ఆత్మహత్య చేసుకుంది. ఈ  సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. తమ కూతురును భర్తతో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆందోళనకు దిగారు.

పోలీసులు తెలిపిన మేరకు.. గద్వాల కేతిరెడ్డిపల్లి మండలం తూర్పుతాండాకు చెందిన రేణమ్మ(19), శ్రీను(22)కు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. వివాహం అనంతరం భార్యభర్తలు రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ ప్రాంతానికి వలస వచ్చి నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం రేణమ్మ తల్లిదండ్రులకు ఫోన్‌చేసి తనను సూటిపోటి మాటలతో వేధించడంతో పాటు కొడుతున్నట్లు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లిదడ్రులు ఇద్దరినీ సముదాయించారు.

బుధవారం ఉదయం కూతురు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందంటూ సమాచారం అందడంతో రేణమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీనుతో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని నిందితులను తమకు అప్పగించాలంటూ డిమాండ్‌ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.     

చదవండి: (పలువురు మహిళలతో వివాహేతర సంబంధం.. మాజీ డీజీపీ కుమారుడిపై కేసు)

మరిన్ని వార్తలు