రక్షా బంధన్‌ రోజునే అక్కాతమ్ముడి మృతి..

23 Aug, 2021 20:37 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

 అక్కా తమ్ముడు, అన్నా చెల్లెళ్ల అనుబంధంగా జరుపుకునే రక్షాబంధన్‌ రోజునే అక్కా తమ్ముడి నిండు ప్రాణాలు రోడ్డు ప్రమాద రూపంలో కబళించుకుపోయాయి.  కష్టసుఖాలు పంచుకుంటూ అన్నింటిలోనూ తోడునీడగా ఉన్న వారు మరణంలోనూ కలిసి తిరిగిరానిలోకాలకు చేరారు. తీవ్రంగా గాయపడిన తమ్ముడి మేనకోడలు మృత్యువుతో పోరాడు తోంది.  

సాక్షి,చెన్నూరు: రోడ్డు ప్రమాదంలో అక్కాతమ్ముడు ఇండ్ల వెంకట లక్షుమ్మ (47), చెరువు మల్లేష్‌ (45) మృతిచెందారు. ఆదివారం సాయంత్రం చెన్నూరు పెన్నా బ్రిడ్జిపై ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో లక్షుమ్మ కుమార్తె లావణ్యకు కాలు తెగిపడగా, తలకు, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల సహకారంతో 108 వాహనంలో గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు.  

సకల మర్యాదలు చేయాలని... 
చాపాడు మండలం నక్కలదిన్నె అనంతపురానికి చెందిన చెరువు మల్లేష్‌కు ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరు అక్కలు ఉన్నారు. మల్లేష్‌ పెద్ద అక్క కుమార్తెను వివాహం చేసుకోగా మృతుడు మల్లేష్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. మల్లేష్‌ సీకే దిన్నె మండలం జమాల్‌పల్లెలో జేసీబీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో రాఖీ పండుగ సందర్భంగా ఆదివారం కడప నగరం అల్మాస్‌పేటలో నివసిస్తున్న అక్క వెంకట లక్షుమ్మ దగ్గర రాఖీ కట్టించుకునేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. అక్క చేత రాఖీ కట్టించుకుని చిన్ననాటి ముచ్చట్లను గుర్తు చేసుకుని అనేక విషయాలు మాట్లాడుకున్నారు.

అనంతరం తనతోపాటు అక్క, మేనకోడలిని ద్విచక్ర వాహనంపై తన ఊరికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేయాలనుకున్నాడు. అందులో భాగంగా సాయంత్రం అక్క, మేనకోడలు లావణ్యను తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఊరికి బయలుదేరాడు. వీరు ప్రయాణిస్తున్న వాహనం చెన్నూరు పరిధిలోని పెన్నా బ్రిడ్జి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం వేగంగా వెనుకవైపునుంచి వచ్చి ఢీకొంది. దీంతో అక్కాతమ్ముడు మృతిచెందగా, లావణ్య కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు.

చదవండి: షాకింగ్‌: నటి ప్రియాంక పండిట్‌ న్యూడ్‌ వీడియో లీక్‌, స్పందించిన నటి

మరిన్ని వార్తలు