‘కామారెడ్డిలో కాలిన శవం మిస్టరీ’ వీడింది

16 Mar, 2021 10:06 IST|Sakshi
మాట్లాడుతున్న బోధన్‌ ఏసీపీ రామారావు, పాల్గొన్న సీఐ రవీందర్‌ నాయక్, ఎస్‌ఐ సందిప్‌

చెల్లిని హింసిస్తున్నాడనే హత్య 

సాక్షి, బోధన్‌రూరల్‌(బోధన్‌): మండలంలోని కొప్పర్గ గ్రామంలో ఈ నెల 11న లభించిన కాలిన శవం మిస్టరీని బోధన్‌ పోలీసులు ఛేదించారు. ఈమేరకు పట్టణంలోని బోధన్‌ రూరల్‌ సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బోధన్‌ ఏసీపీ రామారావు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని బిలోలి తాలుక లాడ్క గ్రామానికి చెందిన అమృత్‌వార్‌ అశోక్‌ను, కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం మల్లపూర్‌ గ్రామానికి చెందిన బాగవ్వ కూతురు అంజమ్మకు ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు. ఇల్లరికంగా వచ్చిన అశోక్‌కు రెండు ఎకరాల వ్యవసాయ భూమి, ఇళ్లు అందజేశారు.

కానీ అశోక్‌ పెళ్లి తర్వాత వ్యాసనాలు, జల్సాలకు అలవాటు పడి భూమిని అమ్ముకుని భార్య, కూతురును ఇబ్బందులను గురిచేశాడు. దీంతో వారి కుటుంబ కలహాల గురించి పలుమార్లు పెద్దలు అశోక్‌ను మందలించారు. అయినా అశోక్‌ తన పద్దతి మార్చుకోలేదు. ఈక్రమంలో అంజమ్మకు అన్న వరుసైన మహారాష్ట్రలోని బిలోలి తాలుక కార్లా గ్రామానికి చెందిన తొకల్‌వార్‌ పోచయ్య అశోక్‌ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తన చెల్లెలు కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని అశోక్‌ను హతమార్చాలని పోచయ్య పథకం వేశాడు. ఈక్రమంలో నిందితుడు పోచయ్య పథకం ప్రకారం అశోక్‌ను మద్యం తాగుదామని పిలిపించి బోధన్‌ మండలంలోని కొప్పర్గ శివారులోకి తీసుకువచ్చాడు.

మద్యం తాగిచ్చి మద్యం మత్తులో ఉన్న అశోక్‌పై దాడి చేసి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించాడని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్‌ కాల్స్‌ డాటా ఆధారంగా ఈ హత్య కేసును చేధించినట్లు ఏసీపీ రామారావు తెలిపారు. చాకచక్యం వ్యవహరించి కేసు చేధించిన బోధన్‌ రూరల్‌ సీఐ రవీందర్‌ నాయక్, ఎస్సై సందీప్, కానిస్టేబుల్స్‌లు అనంద్‌ గౌడ్, సురేష్, జీవన్, హోంగార్డు సర్దార్‌లను ఏసీపీ రామారావు అభినందించి నగదు పురస్కారాన్ని అందజేశారు. సమావేశంలో బోధన్‌ రూరల్‌ సీఐ రవీందర్‌ నాయక్, ఎస్‌ఐ సందిప్, పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు