ఇద్దరూ.. ఇద్దరే.. చోరీల్లో అన్నదమ్ముల బంధం!

11 Nov, 2021 12:44 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు

సాక్షి, కాగజ్‌నగర్‌(ఆదిలాబాద్‌): పట్టణంలోని ఇందిరా కూరగాయల మార్కెట్‌లో ఈనెల 7న జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ మేరకు ఎస్పీ వైవీ సుధీంద్ర బుధవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులతో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోపాలవాడకు చెందిన చునార్కర్‌ దేవాజీ అలియస్‌ దేవరాజ్, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడికి చెందిన చునార్కర్‌ శంకర్‌ అలియస్‌ చిన్న శంకర్‌ వరుసకు సోదరులు.

కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో చోరీలకు అలవాటుపడ్డ వీరు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. కాగా శంకర్‌ స్థానిక ఇందిరా మార్కెట్‌లో గత నెల రోజులుగా రెక్కీ నిర్వహించాడు. కూరగాయల వ్యాపారి నికొరె ప్రమీల గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు. ఈనెల 7న ప్రమీల హోల్‌సెల్‌ వ్యాపారికి చెల్లించేందుకు రూ.4.25లక్షలను తీసుకుని వెళ్తుండగా విషయాన్ని దేవరాజ్‌కు తెలిపాడు.

మధ్యలో ప్రమీల కూరగాయలు కొనుగోలు చేస్తున్న సమయంలో దేవరాజ్‌ నగదు ఉన్న బుట్టను మాయం చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బుధవారం ఉదయం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని నిందితులిద్దరిని పోలీసులు పట్టుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో చోరీలు..
నిందితులిద్దరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 12 చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు. దేవరాజ్‌పై మంచిర్యాల జిల్లాలో సస్పెక్ట్‌ షీట్‌ ఉందని తెలిపారు. పలుమార్లు జైలుకు కూడా వెళ్లివచ్చినట్లు వివరించారు. గతేడాది డిసెంబర్‌ 3న ఆసిఫాబాద్‌ కూరగాయల మార్కెట్‌లో ఓ మహిళ నుంచి రూ.60వేలు చోరీ చేసినట్లు తెలిపారు. ఆ సొమ్ములో రూ.50వేలను సైతం రికవరీ చేసినట్లు వివరించారు.

ప్రస్తుతం నిందితుల నుంచి రూ.4,71,915ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసు చేధనలో ప్రధాన పాత్ర పోషించిన డీఎస్పీ ఎ.కరుణాకర్, ఇన్‌చార్జి సీఐ పల్నాటి రాజేంద్రప్రసాద్, పీఎస్సైలు సనత్‌రెడ్డి, తేజస్వీని, సిబ్బందిని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. 
 

మరిన్ని వార్తలు