పాతకక్షలు.. ఆస్పత్రిలో హత్య! 

17 Feb, 2021 04:27 IST|Sakshi
మృతుడు ప్రభాకర్‌రావు

ఉయ్యూరు(పెనమలూరు): ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... కొండపల్లికి చెందిన మొగిలి ప్రభాకర్‌రావు (42) కంటికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు సోమవారం ఉయ్యూరులోని రోటరీ నేత్ర వైద్యశాలకు వచ్చారు. మంగళవారం ప్రభాకర్‌రావుకు శస్త్ర చికిత్స చేసి వార్డుకు తరలించారు. ప్రభాకర్‌రావు వార్డులో విశ్రాంతి తీసుకుంటుండగా అతని భార్య పార్వతి, తల్లి సామ్రాజ్యం మందులు తేవడానికి బయటకు వెళ్లారు.

ఆ సమయంలో ఓ వ్యక్తి ఆస్పత్రి వార్డులోకి ప్రవేశించి విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాకర్‌రావు శరీరంపై పలుచోట్ల కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అనంతరం పారిపోయే ప్రయత్నం చేయగా వార్డులో ఉన్న రోగులు, వారి బంధువులు అప్రమత్తమై నిందితుడిని పట్టుకున్నారు. సీఐ నాగప్రసాద్, ఎస్‌ఐ షబ్బీర్‌ అహ్మద్‌ ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రావును వైద్యం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి 108లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్యకు పాతకక్షలే కారణమని, నిందితుడు కూడా హతుడి స్వగ్రామానికి చెందిన రమేష్‌ అని పోలీసులు భావిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు