విశాఖలో దారుణ హత్య.. పాత గొడవలా?.. రాజకీయ విభేదాలా?

1 Sep, 2022 07:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని జాలరి పేటలో పాత గొడవలతో ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. హత్యను అడ్డుకున్న అతని భార్యను కూడా తీవ్రంగా గాయపరిచాడు. నిందితుడ్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విశాఖలోని పెద్ద జాలరి పేట ప్రాంతంలో తెడ్డు పోలరాజు.. అప్పన్న అనే ఇద్దరు మత్స్యకారులు కుటుంబాలు జీవిస్తున్నాయి వీరిద్దరూ కలిసి చేపల వేటకు వెళ్తుంటారు. ఈ దశలో తన భార్య పట్ల పోలరాజు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడని అప్పన్న కోపంగా ఉండేవాడు. ఒక రోజు పూలరాజును కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు.
చదవండి: నెల్లూరు జంట హత్యలు: అతడే రెక్కీ నిర్వహించి మరీ మర్డర్‌ ప్లాన్‌!

ఈ దశలో వీరిద్దరి మధ్య వివాదం ముదిరింది. బుధవారం ఉదయం వినాయక చవితి పూజ పనులు చేస్తుండగా పోలరాజు కత్తి పట్టుకొని అప్పన్నపై దాడి చేసి విచక్షణారహితంగా నరికేశాడు అడ్డొచ్చిన అతని భార్యను కూడా తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో అప్పన్న అక్కడికక్కడే మృతి చెందాడు.

అతని భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలరాజును పట్టుకొని పోలీసులకు అప్పగించారు పాత గొడవలతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు చెప్తున్నారు. ఇలా ఉండగా వ్యక్తిగత కక్షల తో పాటు రాజకీయ విభేదాలతోనే ఈ హత్య జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అనుచరుడుగా కొనసాగుతున్న పోలరాజు అమానుషంగా అప్పన్నను చంపేసాడని అతని బంధువులు అంటున్నారు.


 

మరిన్ని వార్తలు