కడపలో యువకుడి దారుణ హత్య

13 Aug, 2021 08:20 IST|Sakshi

 పాత కక్షలే కారణం  

నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు  

సంఘటన స్థలాన్ని పరిశీలించిన కడప డీఎస్పీ  

కడప అర్బన్‌: పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం సాయంత్రం పాత కడప చెరువు వద్ద జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. కడప నగరంలోని రవీంద్రనగర్‌కు చెందిన సయ్యద్‌ సముధాన్‌ అలియాస్‌ సంధానీ(25) కువైట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. మూడు నెలల క్రితం కువైట్‌ నుంచి కడపకు వచ్చాడు. వివాహం చేయాలని కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన రియాజ్‌ అనే వ్యక్తికి, సముధాన్‌కు మధ్య పది రోజుల క్రితం గొడవ జరిగింది.

గతంలో కూడా వీరి మధ్య విభేదాలుండేవని సమాచారం. కాగా గురువారం మధ్యాహ్నం పాతకడపకు చెందిన ఓ వ్యక్తి, తనకు కుమారుడు పుట్టాడని, సముధాన్‌తో పాటు స్నేహితులకు పార్టీ ఇస్తున్నట్లు ఆహ్వానించాడు. అంతా కలిసి సాయంత్రం వరకు పాతకడప చెరువు కట్టమీద సరదాగా గడిపారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రియాజ్‌కు సమాచారం అందింది. దీంతో రియాజ్‌ తన స్నేహితులను వెంట తీసుకుని మారణాయుధాలతో సంఘటన స్థలానికి వెళ్లాడు. అక్కడున్న సముధాన్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలో సముధాన్‌ స్నేహితులను బెదిరించడంతో వారు పరారయ్యారు.

సముధాన్‌ను ఇష్టానుసారంగా కత్తులతో పొడిచి, రక్తపుమడుగులో ఉన్న అతను చనిపోయాడని నిర్ధారించుకుని మృతదేహాన్ని చెరువులో పడేసి వెళ్లారు. నిందితులు పరారవగానే, సముధాన్‌ స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని కడప డీఎస్పీ బూడిద సునీల్, చిన్నచౌక్‌ సీఐ కె. అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ జి. అమర్‌నాథ్‌రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. చెరువులో పడిన మృతదేహాన్ని వెలికితీసి, రిమ్స్‌కు తరలించారు.

నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. హతుని స్నేహితులను కూడా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై హతుని సోదరుడు సయ్యద్‌ మహబూబ్‌బాషా మాట్లాడుతూ తనకు సోదరుని స్నేహితులు ఫోన్‌ చేయగా వచ్చానని, ఇక్కడికి వచ్చి చూడగా శవమై పడి ఉన్నాడని విలపించాడు. కువైట్‌ నుంచి 3 నెలల క్రితమే వచ్చాడని, వివాహ సంబంధాలు చూస్తున్నామని ఇంతలోపే ఈ సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు