మాయమైపోతున్న మనిషి!

19 Feb, 2021 15:00 IST|Sakshi
పెద్దపల్లి న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి (ఫైల్‌ఫోటో)

పదిమందిలో పీకలు కోస్తున్నా స్పందించని జనం

దూరం నుంచి ఫొటోలు, వీడియోలకు పరిమితం 

సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టి సమాజంపై నిందలు 

లాయర్ల హత్యను ప్రత్యక్షంగా చూసిన దాదాపు వంద మంది 

సాక్షి, హైదరాబాద్‌: రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో పట్టపగలు, నడిరోడ్డుపై ఇద్దరు హైకోర్టు న్యాయవాదులను వేట కొడవళ్లతో నరికి చంపుతుండగా వంద మందికిపైగా ప్రత్యక్ష్యంగా చూశారు. అయినా ఈ పాశవిక ఘటనను ఒక్కరంటే ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం సమాజంలో మానవ విలువలు మృగ్యం అవుతున్నాయనేందుకు నిదర్శనం. పాత కక్షల కారణంగా జరిగిన జంటహత్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. పట్టపగలు, నడిరోడ్డు మీద కాపుకాసి, దాడి చేసి అత్యంత పాశవికంగా హతమార్చిన తీరు చాలా ఆందోళనకరం. 

మంథని డిపోకు చెందిన రెండు ఆర్టీసీ బస్సుల నిండా జనం ఉన్నారు. ఆ బస్సులు హత్య జరుగుతున్నంత సేపు హత్యోదంతాన్ని చూసి, నిందితులు పరారయ్యాక అక్కడి నుంచి కదిలారు. అంతేకాకుండా కల్వచర్లతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు, ఆ దారి వెంబడి వెళ్తున్న వారు, బైక్‌పై వెళ్తున్నవారు దాదాపు 100 మందికిపైగా అక్కడే ఆగిపోయారు. దారుణం జరుగుతున్నంత సేపు తమ జేబుల్లో ఉన్న సెల్‌ఫోన్లకు పనిచెప్పారే తప్ప.. ఎవరూ కూడా వారిని ఆపేందుకు సాహసించలేదు. నిందితులు అక్కడ నుంచి వెళ్లిపోయారని నిర్ధరించుకున్నాక.. కొన ఊపిరితో ఉన్న వారి వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తూ వీడియోలు తీశారు. 

పట్టపగలు జరిగిన ఈ ఘోరాన్ని చూసిన ప్రత్యక్ష సాక్షులు వంద మంది. వీరిలో చాలామంది వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. అప్పటి నుంచి సోషల్‌మీడియాలో పోస్టులు, స్టేటస్‌లు పెడుతూ సమాజాన్ని, పోలీసులను, రాజకీయ నేతలను నిందిస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్నప్పుడు హత్యోదంతాన్ని వేడుకలా చూసి, తీరా అక్కడి నుంచి వెళ్లిపోయాక బాధ్యత, సమాజం, అన్యాయం అంటూ సోషల్‌ మీడియాలో ఖండిస్తున్నారు. అసలు ప్రత్యక్ష సాక్షులు అంతమంది ఉన్నా.. వారిలో ఎంతమంది కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతారన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిందే. 

హేయమైన చర్యలు.. 
రాజకీయ నేతలే ఇలాంటి హత్యలకు దిగడం అత్యంత హేయమైన చర్చగా చెప్పొచ్చు. అందులోనూ హైకోర్టు లాయర్లయిన గట్టు వామనరావు, పీవీ నాగమణిలను వేటాడి వేట కొడవళ్లతో నరకడం చాలా దారుణం. రాష్ట్రంలో ఇలాంటి ఘటన మొదటిది కాదు. గతంలోనూ పలు ఉదంతాలు జరిగాయి. అయితే, అందులో బాధితులు, నిందితులు సామాన్యులు. కానీ ఈ ఘటనలో సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతున్న వ్యక్తుల హస్తం ఉండటం అన్ని వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. గతంలో పట్టపగలు జరిగిన దారుణ హత్యలన్నీ కూడా హైదరాబాద్‌లోనే చోటు చేసుకున్నాయి. ఈ వికృత సంస్కృతి ఇప్పుడు పల్లెలకూ విస్తరించడం ఆందోళన కలిగించే పరిణామం. 

రాళ్లతో నుజ్జునుజ్జుగా.. 
(రాజేంద్ర నగర్‌ హత్య జనవరి11, 2021) 
రాజేంద్రనగర్‌లో జనవరి 11వ తేదీ అర్ధరాత్రి జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన ఖలీల్‌ను అత్తాపూర్‌లో నడిరోడ్డు మీద ప్రజలంతా చూస్తుండగా అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్లతో దాడి చేస్తూ, తరుముతూ గాయపరిచారు. కిందపడిన వెంటనే వ్యక్తి చనిపోయాడు. రాళ్లతో శవాన్ని కొడుతూ, నుజ్జునుజ్జుగా చేస్తూ తమ పాశవికతను ప్రదర్శించారు. ఈ హత్యను పలువురు వాహనదారులు వీడియోలు తీసి వైరల్‌ చేశారు. 

పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ ముందే.. 
(జూన్‌ 26, 2019) 
హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న పంజగుట్ట ఠాణా ముందు జరిగిన హత్య తీవ్ర కలకలం రేపింది. సయ్యద్‌ అన్వర్‌ అనే ఆటోడ్రైవర్‌పై మరో ఆటోడ్రైవర్‌ రియాసత్‌ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ ప్రాణ భయంతో పంజగుట్ట స్టేషన్‌లోకి పరిగెత్తాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అన్వర్‌ కన్నుమూశాడు. ఈ హత్యోదంతం అంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. 

దగ్గరికి వెళ్లేందుకు జంకిన పోలీసులు.. 
(నయాపూల్‌ మర్డర్‌.. 2018, నవంబర్‌ 28) 
ఆటోడ్రైవర్‌ గొంతుకోసి, పోలీసుల ముందే 2018 నవంబర్‌లో నయాపూల్‌ వంతెన పక్కన జరిగిన మరో హత్య కూడా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. షకీర్‌ ఖురేïÙ, అబ్దుల్‌ ఖాజా ఇద్దరూ ఆటోడ్రైవర్లు. ఆటో అద్దెల విషయంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. అవి తీవ్రమవడంతో షకీర్‌ ఖురేïÙని అబ్దుల్‌ ఖాజా కత్తితో పొడిచి చంపాడు. షకీర్‌ను చంపాక, ఖాజా అక్కడే కత్తి పట్టుకుని హల్‌చల్‌ చేశాడు. ఈ హత్య అనంతరం నిందితుడిని పోలీసులు కనీసం ప్రతిఘటించలేకపోవడం, కనీసం అతడిని సమీపించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. 

పోలీసుల ముందే హత్య.. 
అత్తాపూర్‌ మర్డర్‌ (సెప్టెంబర్‌ 26, 2018) 
2018 సెపె్టంబర్‌ 26న అత్తాపూర్‌ పిల్లర్‌ నంబర్‌ 138 వద్ద రమేశ్‌ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. మహేశ్‌ అనే యువకుడి హత్య కేసులో రమేశ్‌ నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో కోర్టుకు హాజరై తిరిగి వస్తుండగా.. మహేశ్‌ తండ్రి రమేశ్‌ను అత్తాపూర్‌ వద్దకు రాగానే మరో వ్యక్తి సాయంతో గొడ్డళ్లతో నరికి చంపాడు. ఈ హత్య జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు, పెట్రో కార్‌ సిబ్బంది కనీసం స్పందించలేదు.

మనకెందుకులే అన్న ధోరణి 
సమాజంలో తోటి మనిషి పట్ల జాలి చూపే గుణం రోజురోజుకూ తగ్గిపోతుంది. ముఖ్యంగా గతంలో రోడ్డుపై ఎవరైనా దాడి చేస్తుంటే.. దారిన వెళ్లేవాళ్లు నచ్చజెప్పేవారు, వారిని నిలువరించేవారు. కానీ నేడు పరిస్థితి మారిపోయింది. జరుగుతున్న దాడిని ఆపాల్సింది పోయి జేబులోని సెల్‌ఫోన్‌ తీసి వీడియోలు తీసే సంస్కృతి ఆందోళన కలిగిస్తోంది. కనీస బాధ్యతగా రక్షించాల్సిన తోటిపౌరులే ప్రేక్షకులుగా మారడం శోచనీయం. ‘ఎవరిని ఎవరు చంపితే మనకెందుకులే మనం బానే ఉన్నాం కదా’అనే సంకుచిత ధోరణి వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారే తాము ఎలాంటి సాయం చేయకపోగా.. వ్యవస్థలను నిందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడతారు.  
–వీరేందర్, సైకాలజిస్టు  

చదవండి: న్యాయవాద దంపతుల హత్య: దాగి ఉన్న నిజాలు

మరిన్ని వార్తలు