విషాదం: ఒక్కసారిగా కృష్ణాలో దూకిన బీటెక్‌ విద్యార్థి

5 Apr, 2021 11:58 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి‌: స్నేహితులతోపాటు సరదాగా కృష్ణానదికి వచ్చిన బి.టెక్‌. విద్యార్థి అనంత లోకాలకు వెళ్లడంతో స్నేహితులు, విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు శోక సముద్రంలో మునిగిపోయారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ కృష్ణలంకకు చెందిన బి.టెక్‌ 4వ సంవత్సరం చదివే సాయి (20), అవినాష్‌ అనే స్నేహితుడు, మరో ఐదుగురితో కలిసి ఉండవల్లి-అమరావతి కరకట్ట వెంట ఉన్న ఆక్వా డెవిల్స్‌లోకి ఈతకు వెళ్లారు. అవినాష్‌, మరో ఐదుగురు కృష్ణానదిలోకి దిగి ఈత కొడుతుండగా సాయి గట్టు మీద నుంచొని ఉన్నాడు.

మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ స్నేహితులు ఈత కొట్టడం చూసి ఒక్కసారిగా గట్టు మీద నుంచి కృష్ణానది నీటిలోకి దూకాడు. దూకిన సాయి మునిగిపోయి కనిపించకపోవడంతో ఆక్వా డెవిల్స్‌ సిబ్బంది వెదికి, బయటకు తీయగా సాయి మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై సాయి తల్లిదండ్రులు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. సాయి మృతదేహాన్ని స్నేహితులు విజయవాడ తీసుకువెళ్లారు. సాయి వారి తల్లిదండ్రులకు ఏకైక కుమారుడిగా తెలియవచ్చింది.

నలుగురు జూదరుల అరెస్ట్‌ 
చిట్టినగర్‌(విజయవాడ పశ్చిమ): కొత్తూరు తాడేపల్లిలో పేకాట ఆడుతున్న నలుగురిని కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కొత్తూరు తాడేపల్లిలో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో సెక్టార్‌ ఎస్‌ఐ శేఖర్‌బాబు పేకాట శిబిరంపై దాడి చేసి నలుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి రూ. 28 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

శానిటైజర్లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు 
చిట్టినగర్‌: నిబంధనలకు విరుద్దంగా శానిటైజర్లు విక్రయిస్తున్న వ్యక్తిని కొత్తపేట పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కొత్తపేటకు చెందిన పి. మురళి కొంతకాలంగా శానిటైజర్‌ను చిన్నచిన్న బాటిల్స్‌గా చేసి విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న సెక్టార్‌ ఎస్‌ఐ విశ్వనాథ్‌ నిందితుడిని అరెస్టు చేసి 80 బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం 

చిట్టినగర్: పాముల కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు కాలువలో ఉన్న మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. కాలువలో సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి నీటిలో కనిపించడంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడా.. లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు