రైలు పట్టాలపై బీటెక్‌ కుర్రాడి మృతదేహం.. ఉదయ్‌పూర్‌ తరహా హత్య?!

26 Jul, 2022 12:59 IST|Sakshi

భోపాల్‌: రైలు పట్టాలపై బీటెక్‌ కుర్రాడి మృతదేహం పడి ఉండడం, ఈ ఘటనకు ఉదయ్‌పూర్‌ టైలర్‌ హత్యోదంతంతో ముడిపడి ఉందన్న కుర్రాడి తండ్రి అనుమానాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. 

మధ్యప్రదేశ్‌ సియోని-మాల్వాకు చెందిన నిషాంక్‌ రాథోడ్‌(20).. రాయ్‌సెన్‌ ఒబయ్‌దుల్లాగంజ్‌ పట్టణంలో హాస్టల్‌లో ఉంటూ బీటెక్‌ మూడో ఏడాది చదువుతున్నాడు. సోదరిని కలుస్తానని చెప్పి హాస్టల్‌ నుంచి శనివారం బయలుదేరాడు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఆమెను కలిసి.. ఆపై తిరిగి హాస్టల్‌కు చేరుకోలేదు. అయితే కాసేపటికే అతని తండ్రికి, ఇతర స్నేహితులు, బంధువులకు అతని ఫోన్‌ నుంచి ఓ బెదిరింపు మెసేజ్‌ వెళ్లింది.

దీంతో అప్రమత్తమైన నిషాంక్‌ కుటుంబ సభ్యులు మిస్సింగ్‌ కంప్లయింట్‌ ఇచ్చారు. అయితే ఆ మరుసటి రోజే సమీపంలోని ఓ రైల్వే ట్రాక్‌ మీద శవమై కనిపించాడు నిషాంక్‌. రైలు మీది నుంచి వెళ్లడంతో అతని శరీరం ఛిద్రమైపోయింది. నిషాంక్‌ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌లో డబ్బులు పొగొట్టుకున్నాడు. ఈ తరుణంలో తొలుత ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావించారు. 

అయితే నిషాంక్‌ తండ్రి ఉమా శంకర్‌ రాథోడ్‌.. తన కొడుకు ఫోన్‌ నుంచి తన ఫోన్‌కు వచ్చిన సందేశాల్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో అసలు వ్యవహారం మొదలైంది. ‘.. తల వేరు చేయబడింది’ అంటూ ఉంది ఆ సందేశంలో. అంతేకాదు.. ‘రాథోడ్‌ సార్‌.. మీ అబ్బాయి చాలా ధైర్యశాలి’ అంటూ ఆ సంభాషణ నడిచింది. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదంటున్నాడు.  

Guztakh-e-Nabi ki Ek hi Saja, Sar Tan se Juda అనే మాటల్ని.. ఉదయ్‌పూర్‌ టైలర్‌ కన్హయ్యలాల్‌ హత్య టైంలో హంతకులు ఉపయోగించారు. దీంతో తన కొడుకును చంపేసి ఉంటారని మృతుడి కుటుంబం అనుమానిస్తోంది. సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు.. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఓ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఒంటరిగా కనిపించాడని, అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

చదవండి: హారన్‌ కొడితే తప్పుకోలేదని.. చెవిటి వ్యక్తిని చంపేసింది

మరిన్ని వార్తలు