బీటెక్‌ విద్యార్థిని ప్రేమవివాహం.. గ్రామంలోకి వచ్చి బలవంతంగా..

6 Nov, 2022 12:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ప్రకాశం(కొత్తపట్నం): వారు ప్రేమించుకున్నారు.. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ అమ్మాయి కన్నవారికి నచ్చలేదు.. వెంటనే అమ్మాయి ఆచూకీ కనుగొని బలవంతంగా తీసుకెళ్లడానికి యత్నించగా గ్రామస్తులు అడ్డుకుని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారందరినీ అదుపులోనికి తీసుకున్నారు.

వివరాలు.. తమిళనాడుకు చెందిన జీవిత శివకుమారి గూడురు కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. కొత్తపట్నం మండలం గుండమాల గ్రామానికి చెందిన కారాని రాజేష్‌ తిరుమలలో వెంకటేశ్వరస్వామి దర్శినానికి  వెళ్లాడు. అదే సమయంలో చెన్నై నుంచి వారి బంధువులతో జీవిత శివకుమారి కూడా దర్శినానికి వచ్చింది. ఇలా ఇద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమదాకా దారి తీసింది. ఇటీవల సింగరాయకొండలో వివాహం చేసుకున్నారు.

తరువాత కొత్తపట్నం పోలీస స్టేషన్‌కు వచ్చి తమకు ప్రాణహాని ఉందని రక్షించాలని వేడుకున్నారు. అప్పటికే  యువతి తల్లిదండ్రులు గూడూరు పోలీస్‌ స్టేషన్‌లో తమ కుమార్తె అదృశ్యం అయిందని ఫిర్యాదు చేశారు. వారు కొత్తపట్నంలో ఉన్నారని తెలుసుకున్న గూడూరు టూటౌన్‌ ఎస్సై, కొత్తపట్నం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇద్దరినీ తీసికెళతానని చెప్పాడు. వెంటనే గుండమాల గ్రామస్తులు కలుగచేసుకుని ఇద్దరూ మేజర్లు అయితే ఎలా తీసికెళతారని ప్రశ్నించారు. దీంతో ఏమీ చేయలేక ఎస్సై వెనుతిరిగాడు. అయితే వారం రోజుల తరువాత మళ్లీ కొత్తపట్నం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఇద్దరూ గూడూరు రావాలని కోరాడు. కానీ యువతి నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయాడు.

ఈ క్రమంలో గత నెల అక్టోబర్‌ 19న సంప్రదాయబద్ధంగా పెద్దల సమక్షంలో చర్చిలో వివాహం చేసుకున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం గూడూరు నుంచి 30 మంది వాహనాల్లో వచ్చి యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసికెళ్లారు. గ్రామస్తులు అడ్డగించినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న సర్పంచ్‌ కారాని జయరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దారిలోనే వారిని పోలీసులు అడ్డగించి ఒంగోలు టూటౌన్‌కు తీసుకొచ్చారు.

అయితే పెండ్లి కుమార్తె తండ్రి కారాని శ్రీను.. కొత్తపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చాడు. తమ కోడలను ఆమె మేనమామలు భాస్కర్‌రెడ్డి, భరత్‌రెడ్డి మరి కొంత మంది బలవంతగా తీసికెళ్లారని యువకుని తండ్రి ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో ఎస్సై కొక్కిలగడ్డ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు