Visakhapatnam: పాడి గేదె పంచాయితీ.. ప్రాణం తీసిన క్షణికావేశం!

12 Dec, 2021 09:10 IST|Sakshi

పాడి గేదె కొనుగోలు, అమ్మకంలో వివాదం 

కర్రతో దాడి చేయడంతో మధ్యవర్తికి తీవ్రగాయాలు 

కేజీహెచ్‌కు తరలిస్తుండగా మృతి 

హత్య కేసుగా నమోదు చేసిన పట్టణ పోలీసులు 

నర్సీపట్నం: పాడి గేదె అమ్మకం.. కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదం చివరకు ఒకరి మృతికి కారణమైంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బలిఘట్టానికి చెందిన భీమిరెడ్డి నూకరాజు రెండు రోజుల క్రితం ఇక్కడికి సమీపంలోని కృష్ణాపురానికి చెందినబర్ల అప్పారావు వద్ద గేదెను రూ.49 వేలకు కొనుగోలు చేశాడు. అడ్వాన్సుగా రూ.20 వేలు చెల్లించి, మిగతా మొత్తం మూడు రోజుల తరువాత ఇస్తానని చెప్పి గేదెను తీసుకువెళ్లాడు. మూడు రోజులు తరువాత రూ.29 వేలు ఇవ్వలేదు. గేదె కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించిన బలిఘట్టానికి చెందిన శెట్టి వెంకటరమణను వెంటబెట్టుకుని అప్పారావు డబ్బులు అడిగేందుకు నూకరాజు ఇంటికి వెళ్లాడు.  తీసుకువచ్చిన మరుసటి రోజు నుంచే మేత తినటం లేదని గేదె ను తోలుకు పొమ్మని నూకరాజు అన్నాడు.

నూకరాజు, అప్పారావు మధ్య డబ్బులు విషయంలో గీజులాడుకుంటున్నారు.  మధ్యవర్తి వెంకటరమణ కలుగజేసుకుని ఇవ్వాల్సిన రూ.29 వేలలో రూ. 2 వేలు తగ్గించి రూ.27 వేలు అప్పారావుకు ఇవ్వాలని, లేకుంటే రూ. 2 వేలు తగ్గించి రూ.18 వేలు ఇస్తాడు నువ్వైనా తీసుకోమని నూకరాజుకు చెప్పాడు. తాను ఇచ్చిన రూ.20 వేలలో పైసా తగ్గించిన తీసుకోనని నూకరాజు భీష్మించాడు. దీంతో మధ్యవర్తి, నూకరాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో క్షణికావేశంలో నూకరాజు కర్రతో వెంకటరమణ తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయమైంది. వెంటనే వెంకటరమణను ఏరియా ఆస్పత్రికి  చికిత్స నిమిత్తం తరతలించారు.  పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. విశాఖకు తరలిస్తుండగా వెంకటరమణ మార్గం మధ్యలో మృతి చెందాడు. దీనిపై హత్యగా కేసు నమోదు చేశామని పట్టణ ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. మృతుడికి భార్య మంగ, ఇద్దరు ఆడపిల్లలు, బాబు ఉన్నారు.

చదవండి: ఐయామ్‌ వెరీ సారీ..! కత్రినాకైఫ్‌ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..! 

మరిన్ని వార్తలు