Bully Boy App Case: 19 ఏళ్ల యువతే ప్రధాన సూత్రధారి! 

5 Jan, 2022 07:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముంబై(మహరాష్ట్ర): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుల్లి బాయ్‌ యాప్‌ కేసులో ముంబై సైబర్‌ సెల్‌ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా భావిస్తున్న ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి శ్వేతా సింగ్‌ను మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి విశాల్‌ కుమార్‌ ఝా (21)ను సోమవారమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. విశాల్‌ ఇచ్చిన సమాచారం మేరకు ప్రధాన నిందితురాలైన శ్వేతా సింగ్‌ను ఉత్తరాఖండ్‌లో అరెస్ట్‌ చేసినట్టుగా తెలుస్తోంది.  

ఇద్దరూ ఫ్రెండ్స్‌
శ్వేత, విశాల్‌లకు పూర్వ పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని పోలీసులు తెలిపారు. శ్వేతను ముంబైకి తీసుకురావడానికి వీలుగా ఉత్తరాఖండ్‌లోని స్థానిక కోర్టు ఆమెకు నాలుగురోజుల ట్రాన్సిట్‌ రిమాండ్‌ విధించింది. విశాల్‌ను మంగళవారం ముంబైలోని బాంద్రా మెట్రోపాలిటన్‌ కోర్టు ఎదుట హాజరుపరచగా న్యాయస్థానం అతనికి జనవరి 10 వరకు రిమాండ్‌ విధించింది.

ముంబై సైబర్‌ పోలీసుల బృందం ఉత్తరాఖండ్‌లో అదుపులోకి తీసుకున్న శ్వేతా సింగ్‌ ఈ యాప్‌ రూపొందించడం వెనుక కీలక పాత్ర పోషించిందన్న అనుమానాలున్నాయి. ఈ యాప్‌కి సంబంధించి ఆమె ఎన్నో వేర్వేరు అకౌంట్లు కలిగి ఉంది. విశాల్‌ని, యువతిని కలిసికట్టుగా విచారించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే 100 మందికిపైగా ముస్లిం మహిళల ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్‌ చేసి బుల్లి బాయ్‌ అనే యాప్‌లో అప్‌లోడ్‌ చేసి వేలానికి ఉంచిన విషయం తెలిసిందే.

నిందితులు ఆ ఫోటోలను వేలానికి పెట్టినప్పటికీ వారి అసలు ఉద్దేశం మైనార్టీ మహిళల్ని అవమానించడమేనని పోలీసులు భావిస్తున్నారు. విశాల్‌ ‘ఖాల్సా సుప్రిమసిస్ట్‌’ పేరుతో ట్విట్టర్‌ ఖాతాను నిర్వహిస్తున్నాడని, మరికొన్ని నకిలీ ట్విట్టర్‌ ఖాతాల పేర్లను కూడా మార్చి సిక్కుల పేర్లను పోలిన వాటిని వాడినట్లు పోలీసులు తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తించే ప్రయత్నం ఏదైనా చేశారా? అనే కోణంలోనూ విచారించనున్నట్లు తెలిపారు.   

చదవండి: ముస్లిం విద్యార్థులు సూర్య నమస్కారాల్లో పాల్గొనవద్దు


 

మరిన్ని వార్తలు