బస్సు టైరు పేలడంతో ఘోర ప్రమాదం

30 Mar, 2021 10:07 IST|Sakshi

సాక్షి, చెన్నై: పొట్టకూటి కోసం వత్తలకుండు సమీపంలోని మిల్లులో పనికి వెళ్తున్న కార్మికుల్ని ప్రభుత్వ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. ఐదుగురు మృతిచెందగా, పదిహేను మంది గాయపడ్డారు.  దిండుగల్‌ జిల్లా వత్తలకుండు శింగార కోట్టైలో ప్రైవేటు మిల్లు ఉంది. సోమవారం ఉదయాన్నే ఒట్టుపాడు గ్రామానికి చెందిన 19 మంది కార్మికులతో మిల్లుకు ఓ వ్యాన్‌ బయలుదేరింది. వ్యాన్‌ను వత్తలకుండుకు చెందిన సురేష్‌(32) నడిపాడు. 

పేలిన టైర్‌.. 
మార్గ మధ్యలో సెవుకం పట్టి క్రాస్‌ రోడ్డు వద్ద వ్యాన్‌ వెళుతుండగా, దిండుగల్‌ నుంచి తేని వైపు వెళ్తున్న ప్రభుత్వ బస్సు టైర్‌ పేలడంతో అదుపు తప్పింది. వేగంగా వచ్చిన బస్సు వ్యాన్‌ను ఢీకొంది. దీంతో వ్యాన్‌ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ఇందులోని కార్మికులు కొందరు రోడ్డుపై పడ్డారు. వీరు పెడుతున్న కేకల్ని విన్న స్థానికులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్‌ శిథిలాల కింద చిక్కుకుని నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

గాయపడ్డ 15 మందిని ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలంలో మృతి చెందిన వారిలో డ్రైవర్‌ సురేష్, వత్తలకుండు దక్షిణం వీదికి చెందిన సుగుణ(40), అన్నానగర్‌కు చెందిన లత(35), ఉసిలం పట్టికి చెందిన కాళిదాసు(28) ఉన్నారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. గాయపడ్డ వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.  సమాచారం అందుకున్న పట్టి వీరన్‌ పట్టి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాల్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు