Chittoor Bus Accident: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు

27 Mar, 2022 03:12 IST|Sakshi
భాకరాపేట ఘాట్‌లోని లోయలో బోల్తాపడిన బస్సు

ఎనిమిది మంది దుర్మరణం

ధర్మవరం నుంచి పుత్తూరు నిశ్చితార్థానికి వెళ్తుండగా ఘటన 

రాత్రి 10 గంటలకు భాకరాపేట ఘాట్‌లో అదుపుతప్పి లోయలోకి.. 

క్షతగాత్రుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన లోయ  

సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేసిన అధికారులు 

గాయపడ్డ వారిని 20 అంబులెన్స్‌ల్లో రుయాకు తరలింపు

చంద్రగిరి: ఓ పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమానికి బయలుదేరిన బస్సు (కేఎల్‌30 ఏ 4995) చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్‌లో శనివారం రాత్రి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా ధర్మవరంలోని మారుతినగర్‌కు చెందిన పట్టు చీరల వ్యాపారి (కోమలి శిల్క్‌ హౌస్‌) మలిశెట్టి మురళి కుమారుడు మలిశెట్టి వేణు (25)కు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనంకు చెందిన ఓ యువతితో ఆదివారం నిశ్చితార్థం జరగాల్సి ఉంది.

వేణుతో పాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు 55 మంది శనివారం ఓ ప్రైవేట్‌ బస్సులో తిరుపతికి బయలుదేరారు. రాత్రి 10 గంటల సమయంలో మార్గంమధ్యలో తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో భాకరాపేట ఘాట్‌లో బస్సు ఒక్కసారిగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లింది. చుట్టూ చిమ్మ చీకటి, ముళ్ల పొదలు, బండరాళ్ల మధ్య ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు హడలిపోయారు. కాపాడండి సారూ.. అంటూ పెద్ద పెట్టున కేకలు వేశారు. బస్సు పల్టీలు కొట్టడంతో ఆ కుదుపులకు కొందరి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో బస్సు మొత్తం రక్తమయమైంది.   
 
అయ్యా.. కాపాడండి.. 
బస్సు పల్టీలు కొడుతూ లోయలో పడిపోగానే అందులో ఉన్న వారు భయంతో కేకలు పెట్టారు. కొందరు కిటికీల్లోంచి బయటకు వచ్చినా, చీకట్లో వారికేమీ కనిపించలేదు. చిన్న పిల్లలు గుక్క పట్టి ఏడుస్తుండగా, మహిళల ఆర్తనాదాలు మిన్నంటాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు విన్న వాహనదారులు లోయలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ముళ్ల కంపలు, రాళ్లు, రప్పల మధ్య అతికష్టం మీద లోయలోంచి కొందరు క్షతగాత్రులను పైకి తీసుకొచ్చారు. మరికొందరు బస్సులోనే చిక్కుకుపోవడంతో వారిని తీయడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు భాకరాపేట, చంద్రగిరి పోలీసులతో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

కలెక్టర్‌ హరినారాయణన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు హర్షితరెడ్డి హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. 250 నుంచి 300 అడుగుల లోతు నుంచి క్షతగాత్రులను పైకి తీసుకొచ్చేందుకు వందలాది మంది పోలీసులు, రోప్‌ బృందాలు, స్థానికులు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కరికి ఆరుగురు చొప్పున సాయపడాల్సి వచ్చింది. ఒకరిని పైకి తీసుకొచ్చేందుకు అరగంటకు పైగా సమయం పట్టింది. లైట్లు ఒకరు పట్టుకొని, మరొకరు తాడు సాయంతో.. ఇలా ప్రమాదకర స్థితిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆరుగురి మృతదేహాలు లభ్యం కాగా, 35 మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 20 అంబులెన్స్‌లలో తిరుపతి రుయాకు తరలించారు. కాగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.  

క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం   
 
అతివేగమే కారణం 
ప్రమాదకరమైన మలుపులు ఉన్న భాకరాపేట ఘాట్‌ రోడ్డులో ఈ బస్సు డ్రైవర్‌ ఎక్కువ వేగంతో నడిపినట్లు సమాచారం. నిత్యం ఈ రహదారిలో వెళ్లే డ్రైవర్లు మాత్రమే వేగంగా వెళ్లడానికి వీలుంటుంది. అలాంటిది ప్రమాదానికి గురైన బస్సు డ్రైవర్‌ అనుభవ రాహిత్యం వల్లే వేగాన్ని కంట్రోల్‌ చేయలేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరగడానికి ముందు సమీపంలోని పెట్రోల్‌ బంకులో బస్సుకు డీజిల్‌ పట్టించారు.

ఆ సమయంలో బస్సును ముందుకు కదిల్చే క్రమంలో ర్యాష్‌ డ్రైవింగ్‌పై పలువురు డ్రైవర్‌ను హెచ్చరించారు. జాగ్రత్తగా వెళ్లాలని చెప్పారు. ఇది జరిగిన కాసేపటికే ఘాట్‌ మొదటి మలుపు వద్దే బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఐదు పల్టీలు కొట్టినట్లు ఓ ప్రయాణికుడు తెలిపాడు. ఈ ఘటనలో వధూ వరుల కుటుంబాల వారు, బంధు మిత్రులు విషాదంలో మునిగిపోయారు. కాగా, 2000లో ఇదే ఘాట్‌లో ఓ పెళ్లి బృందం బస్సు బోల్తా పడి 12 మంది మృతి చెందారు.     

మరిన్ని వార్తలు