ఆధారాల్లేని వార్తలపై దావా వేస్తా: కలహర్‌రెడ్డి

14 Apr, 2021 13:58 IST|Sakshi

దినపత్రిక, టీవీ చానల్‌కు లీగల్‌ నోటీసులిస్తా

నేను, నా కుటుంబం తీవ్రంగా కలత చెందుతున్నాం

బెంగళూరు పోలీసులకు నా స్టేట్‌మెంట్‌ ఇచ్చాను

మూడేళ్ల కింద పార్టీకి వెళ్లాను, డ్రగ్స్‌ తీసుకోలేదు

మీడియాతో ఫైనాన్షియర్‌ కలహర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: బెంగళూరు డ్రగ్స్‌ కేసులో తనపై వస్తున్న వార్తలన్నీ నిరాధారమని ఫైనాన్షియర్‌ కలహర్‌రెడ్డి అన్నారు. తనపై నిరాధార వార్తలు రాసిన ఓ దినపత్రిక, ఓ టీవీ చానల్‌కు త్వరలోనే లీగల్‌ నోటీసులు పంపుతున్నానని, పరువు నష్టం దావా కూడా వేస్తానని వెల్లడించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్‌ కేసుతో తనక సంబంధముందంటూ వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. తాను మూడేళ్ల కింద బెంగళూరులో జరిగిన బర్త్‌ డే పార్టీకి వెళ్లిన మాట వాస్తవమేనని, ఆ పార్టీకి తనతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 300 మంది వరకు అతిథులు హాజరయ్యారని గుర్తుచేసుకున్నారు. ఆ రోజు జరిగిన విందులో తాను ఎలాంటి డ్రగ్స్‌ తీసుకోలేదని స్పష్టం చేశారు. తనకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమేనని, స్టేట్‌మెంట్‌ రికార్డు కోసమే తనను పిలిపించారని తెలిపారు. బెంగళూరు పోలీసులకు ఆ రోజు జరిగిన పార్టీకి సంబంధించిన వివరాలు ఇచ్చానన్నారు. అక్కడ స్టేట్మెంట్‌ ఇచ్చినంత మాత్రాన డ్రగ్స్‌ కేసుతో ఎలా సంబంధం అంటగడతారు అని ప్రశ్నించారు. 

కుటుంబం కలత చెందుతోంది..! 
డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా.. కొన్ని మీడియా సంస్థలు తన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నాయని కలహర్‌రెడ్డి వాపోయారు. ఈ ప్రచారం వల్ల తాను, తన కుటుంబం ఎంతో కలత చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా దగ్గర ఆధారాలు ఉంటే వార్తలు రాసుకోవాలని, కానీ అస్సలు సంబంధం లేని తనకు ఈ కేసుతో ముడిపెట్టి వార్తలు రాయడం సరికాదని విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కేసుతో సంబంధముందంటూ ఆరోపణలు వస్తోన్న సందీప్‌తో తనకు ముఖ పరిచయమే తప్ప ఎలాంటి ఇతర సంబంధాలు లేవన్నారు. శంకర్‌గౌడతో మాత్రం తనకు ఐదేళ్లుగా స్నేహం ఉందని తెలిపారు. 

తెలంగాణ ఎమ్మెల్యేలు రాలేదు..  
మీడియా సమావేశం అనంతరం ‘సాక్షి’ కలహర్‌రెడ్డిని ఫోన్‌లో సంప్రదించింది. ఈ సందర్భంగా కలహర్‌రెడ్డి మాట్లాడుతూ, ఈ కేసుతో సంబంధం లేకున్నా తన పేరును ప్రస్తావిస్తోన్న ఓ దినపత్రిక, మరో న్యూస్‌ చానల్‌కు త్వరలోనే లీగల్‌ నోటీసులు పంపుతానని స్పష్టం చేశారు. తన ఫేస్‌బుక్‌ వాల్‌పై నుంచి అనుమతి లేకుండా తనవి, తన మిత్రుల ఫొటోలను డౌన్‌లోడ్‌ చేసి ఎలా టెలికాస్ట్‌ చేస్తారని ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలోనూ తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఆ బర్త్‌డే పార్టీ కూడా 2018 అక్టోబర్‌లో జరిగిందని, సదరు పార్టీకి తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరూ రాలేదని అన్నారు. శంకర్‌గౌడ, తాను సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లమని ఐదేళ్ల క్రితం నుంచి ఆయనతో పరిచయం ఉందని వెల్లడించారు.

చదవండి: చితికిన జీవితం.. విద్యావలంటీర్‌ బలవన్మరణం

మరిన్ని వార్తలు