యూట్యూబ్‌ వీడియో చూసి బ్యాంకు దోపిడీకి స్కెచ్‌

5 Oct, 2020 18:18 IST|Sakshi

భువనేశ్వర్‌ : లాక్‌డౌన్‌ నష్టాలను పూడ్చుకునేందుకు రెడీమేట్‌ బట్టల వ్యాపారం చేసే 25 ఏళ్ల వ్యక్తి తాను రుణం తీసుకున్న బ్యాంకుల్లోనే దోపిడీకి పాల్పడిన  ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. యూట్యూబ్‌ వీడియోలను చూస్తూ నిందితుడికి ఈ ఐడియా వచ్చిందని, బొమ్మ తుపాకీని ఉపయోగించి రెండు బ్యాంకుల్లో దోపిడీకి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.  రెండు బ్యాంకుల్లో 12 లక్షల రూపాయలను నిందితుడు దోచుకోగా అతడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు నిందితుడి నుంచి 10 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్‌ సమీపంలోని తంగిబంట గ్రామానికి చెందిన సౌమ్యరంజన్‌ జెనా అలియాస్‌ తులు భువనేశ్వర్‌లోని ఐఓబీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో గతనెల దోపిడీకి పాల్పడ్డాడని నగర పోలీస్‌ కమిషనర్‌ సుధాంషు సారంగి తెలిపారు.

నిందితుడు సెప్టెంబర్‌ 7న ఇన్ఫోసిటీ ప్రాంతంలోని ఐఓబీలో 12 లక్షల రూపాయలు దోపిడీ చేశాడని, సెప్టెంబర్‌ 28న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బరిముంద బ్రాంచ్‌లో దోపిడీకి పాల్పడ్డాడని ఆయన తెలిపారు. నిందితుడి నుంచి 10 లక్షల రూపాయల నగదు, బొమ్మ తుపాకీ, ఓ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు జెనా హెల్మెట్‌ ధరించి బ్యాంక్‌లో కొద్దిమందే ఉన్నప్పుడు లోపలికి ప్రవేశించి నగదు తనకు అప్పగించాలని బొమ్మ తుపాకితీ బెదిరించాడని, బ్యాంకు లూటీకి స్కూటీపై వస్తాడని పోలీసులు చెప్పారు. బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి పాల్పడిన తర్వాత నిందితుడు బుల్లెట్స్‌, గన్‌ను కొనుగోలు చేశాడని చెప్పారు. చదవండి : ప్రేమ కోసం సైకిల్‌పై వేల కిమీ ప్రయాణం.. చివరికి!

కాగా, రెండు బ్యాంకుల్లో నిందితుడికి ఖాతాలున్నాయని, ఆయా బ్యాంకుల నుంచి 19 లక్షల రూపాయల రుణం తీసుకున్నాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బ్యాంకును దోచిన అనంతరం తాను తీసుకున్న రుణంలో కొంత భాగం చెల్లించేందుకు నిందితుడు బ్యాంకుకు వచ్చినట్టు గుర్తించారు. బ్యాంకు రుణంతో వ్యాపారం ప్రారంభించిన నిందితుడు 9 నుంచి 10 లక్షల టర్నోవర్‌ సాధించినా లాక్‌డౌన్‌ సమయంలో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. లాక్‌డౌన్‌ సమయంలో ఒడిషాలో పలుచోట్ల బ్యాంకులు, ఏటీఎంలో చోరీలు అధికమయ్యాయి. గత నెలలో కాంజీహార్‌ పట్టణంలో ఓ వ్యాపారి బ్యాంకు నుంచి 2 లక్షల రూపాయలు దోపిడీ చేశాడు. ఈ ఏడాది మేలో భువనేశ్వర్‌లో 9వ తరగతి చదివే బాలుడు యూట్యూబ్‌ వీడియోలో చూపిన విధంగా ఏటీఎంను పగులగొట్టేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.

మరిన్ని వార్తలు