మీరు డాక్టరా..? అయితే రూ.2 వేలు 

13 May, 2021 06:34 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హిమాయత్‌నగర్‌: క్యాబ్‌ డ్రైవర్ల దోపిడీ ప్రారంభమైంది. కింగ్‌కోఠి నుంచి అల్వాల్‌ వెళ్లేందుకు ఏకంగా రూ.2 వేలు అడిగిన ఘటన కింగ్‌కోఠి ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కింగ్‌కోఠి ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ సంగీత బుధవారం డ్యూటీ ముగించుకొని 3గంటల ప్రాంతంలో కింగ్‌కోఠి ఆస్పత్రి నుంచి అల్వాల్‌లోని తన ఇంటికి క్యాబ్‌ బుక్‌ చేయగా.. రూ.391 చూపింది. డ్రైవర్‌కు కాల్‌ చేసి ఆస్పత్రి లోపలికి రావాలని చెప్పింది.

దీంతో డ్రైవర్‌ స్పందిస్తూ.. మీరు పేషెంటా? స్టాఫా? అని అడిగాడు. నేను డాక్టర్‌ని అనగానే.. ఓహో అయితే రూ.2 వేలు ఇవ్వండి వస్తాను. లేదంటే డ్రైవ్‌ క్యాన్సిల్‌ చేయమన్నాడు. దీంతో ఖంగుతిన్న డాక్టర్‌ సంగీత అక్కడే ఉన్న ఏసీపీ వెంకట్‌రెడ్డికి తెలిపింది. మరొక్కసారి మీరు క్యాబ్‌ బుక్‌ చేయండి ఆ ఛార్జీకే మీరు మీ ఇంటికి వెళ్లేలా నేను చూసుకుంటా అన్నారు. దీంతో సంగీత మరో క్యాబ్‌ బుక్‌ చేయగా.. రూ.341 చూపించింది.

వెంటనే ఆస్పత్రి లోపలికి వచ్చిన డ్రైవర్‌ను ఏసీపీ వెంకట్‌రెడ్డి పిలిచి, డాక్టర్‌ మేడంని జాగ్రత్తగా ఇంటి వద్ద దించు. యాప్‌లో చూపించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఊరుకోను. ఇది ప్యాండమిక్‌ టైమ్, మనకు ఈ టైంలో వైద్యులు చేస్తున్న సేవ ఎంతో భేష్‌. మనమే వారికి ఉచిత సేవను అందించాలని నాలుగు మంచి మాటలు చెప్పారు. దీంతో క్యాబ్‌ డ్రైవర్‌ జాగ్రత్తగా తీసికెళ్లి యాప్‌లో చూపించినంత డబ్బులే తీసుకుంటానంటూ ఏసీపీ వెంకట్‌రెడ్డికి మాట ఇచ్చారు.
చదవండి: కోవిడ్‌ మరణాల్లో మరో రికార్డు
 

మరిన్ని వార్తలు