అక్కడ పేకాట టేబుల్‌కు గంటలు, రోజులు వేచిచూడాలి.. గోపికి మాత్రం..

11 Dec, 2021 16:58 IST|Sakshi

దాని కోసం రూ.కోటి ఖర్చు చేసిన గోపీకృష్ణ

‘నకిలీ కాల్‌ సెంటర్స్‌’ నిందితుడి వ్యవహారమిది 

చెన్నైలో రూ.40 కోట్లు వసూలు చేసిన వైనం 

లాక్‌డౌన్‌లో ఉద్యోగాలు పోయిన వారే టార్గెట్‌గా... 

అక్కడి పోలీసు నిఘా తప్పించుకోవడానికే సిటీకి 

లోతుగా ఆరా తీస్తున్న హైదరాబాద్‌ పోలీసులు

సాక్షి, హైదరాబాద్‌: తిరుమలగిరి కేంద్రంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి భారీ కుంభకోణానికి పాల్పడే ప్రయత్నాల్లో గత వారం నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పట్టుకున్న గోపీ కృష్ణ వ్యవహారాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే తరహా స్కామ్‌లు చేసిన చెన్నై పోలీసులకు మూడుసార్లు చిక్కిన ఇతగాడు విలాసాలు, జల్సాలకే భారీ మొత్తాలు ఖర్చు చేసినట్లు తేలింది. ఇతడి వ్యవహారాలను హైదరాబాద్‌ పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. దీనికోసం చెన్నై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు.  
చెన్నైలోని భారతినగర్‌కు చెందిన గోపీ కృష్ణ ఆరేళ్ల నుంచి కాల్‌ సెంటర్‌ మోసాలు చేస్తున్నాడు. తొలినాళ్లల్లో స్కీముల పేరుతో స్కాములు చేశాడు. ఈ నేరాలకు సంబంధించి అక్కడి పోలీసులు 2015, 2016ల్లో అరెస్టు చేశారు. 
జైలు నుంచి బయటకు వచ్చిన ప్రతిసారి కొత్త ప్రాంతంలో, మరో పేరుతో తన దందా మొదలెట్టేవాడు. 2020లో చెన్నైలోని వలసరివక్కం కేంద్రంగానే మరో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు.  
ప్రతి సందర్భంలోనూ తక్కువ జీతాలకు ఎక్కువ మంది టెలీకాలర్లను నియమించుకునే వాడు. ఇలా ఇప్పటి వరకు దాదాపు 400 మందిని తనకు అనుకూలంగా వినియోగించుకున్నాడు. 

చదవండి: (మహిళా టెక్కీ ఆత్మహత్య.. రెండేళ్ల క్రితమే వివాహం..)

లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయిన వారిని ఆకర్షించేలా పలు ఇన్వెస్టిమెంట్‌ స్కీములు రూపొందించాడు. తమ వద్ద రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి పెడితే ప్రతి రోజూ కనీసం రూ.200 వరకు రాబడి ఉంటుందని నమ్మించాడు. ఇలా మూడు సందర్భాల్లోనూ కలిపి దాదాపు 2 వేల మంది నుంచి రూ.40 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేశాడు. 2020లో ఇతడిపై చెన్నై పోలీసులు గూండా యాక్ట్‌ ప్రయోగించి ఏడాది జైల్లో ఉంచారు.  
గతేడాది అరెస్టు చేసినప్పుడు ఇతడితో పాటు అనుచరుల నుంచి చెన్నై పోలీసులు బీఎండబ్ల్యూ, ఆడి, బెంజ్, హోండా తదితర కంపెనీలకు చెందిన 13 లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు.  
విలాసాలకు అలవాటు పడిన వీరంతా తరచూ థాయ్‌లాండ్, దుబాయ్, హాంగ్‌కాంగ్‌లకు వెళ్లి వారాల పాటు గడిపి వచ్చే వాళ్లు. శ్రీలంక రాజధాని కొలంబోలో ఉన్న ప్రముఖ క్యాసినోల్లో ఒకటైన బల్లీస్‌కు గోపీ రెగ్యులర్‌ కస్టమర్‌. 
ఆ క్యాసినోలో పేకాట ఆడటానికి వెళ్లే వాళ్లు టేబుల్‌ కోసం కొన్ని గంటలు, రద్దీ ఎక్కువ ఉంటే రోజులు ఎదురు చూడాలి. అయితే గోపీకి మాత్రం అందులో శాశ్వతంగా ఓ టేబుల్‌ ఉండేది. దీనికోసం ఇతడు రూ.కోటి ఖర్చు పెట్టినట్లు చెన్నై పోలీసులు గుర్తించారు.  
ఆఖరుసారిగా చెన్నై పోలీసులకు తిరుముల్లాయ్‌వోయల్‌ ప్రాంతంలో కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తూ చిక్కాడు. మూడుసార్లు ఒకే తరహా నేరాలు చేస్తూ చిక్కడంతో ఇతడిపై అక్కడి పోలీసుల నిఘా పెరిగింది.  
దీంతో జైలు నుంచి వచ్చిన ఇతగాడు తిరుమలగిరికి మకాం మార్చాడు. యునైటెడ్‌ ఇండియా హెల్త్‌ ఆర్గనైజేషన్‌ పేరుతో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి మోసాలకు శ్రీకారం చుట్టాడు. అతడి పథకం పారక ముందే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.  

మరిన్ని వార్తలు