రూ.కోటి విలువైన గంజాయి స్వాధీనం

17 May, 2022 04:33 IST|Sakshi

రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా): తెల్లవారు జాము.. మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌ వైపు నల్లరంగు స్కార్పియో వచ్చింది.. తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపారు.. స్కార్పియో డ్రైవర్‌ ఒక్కసారిగా వేగాన్ని పెంచి రంపచోడవరం వైపు పోనిచ్చాడు.. కంగుతిన్న పోలీస్‌లు రెండు కార్లతో ఆ వాహనాన్ని వెంబడించారు.. వెనుక వైపు పోలీస్‌ వాహనం వస్తుంటే ముందుగా వెళుతున్న స్కార్పియో రోడ్డు మలుపులు దాటుకుంటూ వెళుతోంది.. అచ్చు సినిమాల్లోలా. అలా రంపచోడవరం భూపతిపాలెం ప్రాజెక్టు సమీపంలోకి వెళ్లాక అక్కడ మలుపులో సిమెంట్‌ గోడను స్కార్పియో ఢీకొట్టి జలాశయంలోకి దూసుకుపోయింది.

కారులో ఉన్న గంజాయి మూటలు ఒక్కసారిగా చెల్లాచెదురుగా బయట పడిపోయాయి. ప్రాజెక్టులో పడిపోయిన వాహనం నుంచి ఓ వ్యక్తి ఒడ్డుకు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 300 కేజీల వరకూ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టులో పడిపోయిన వాహనాన్ని బయటకు తీసి మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఒడిశా ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఆదివారం రాత్రే మారేడుమిల్లి ప్రాంతానికి తెచ్చి, తరలిస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో కారును వెంబడించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.కోటి వరకూ ఉంటుందని అంచనా. వాహనంలో గంజాయి తరలిస్తున్న సమాచారం రావడంతో నిఘా వేసి పట్టుకున్నట్టు రంపచోడవరం అడిషనల్‌ ఏఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు