ఫర్నిచర్‌ మాటున గంజాయి రవాణా

15 Nov, 2021 05:24 IST|Sakshi
గంజాయిని పరిశీలిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు

రూ.1.5 కోట్ల విలువ చేసే 1,500 కిలోల సరుకు స్వాధీనం

ఒడిశా నుంచి యూపీకి తరలించేందుకు యత్నం.. ముగ్గురి అరెస్ట్‌ 

కాకినాడ క్రైం: వ్యాన్‌లో ఫర్నిచర్‌ మాటున దాచి భారీ మొత్తంలో రవాణా చేస్తున్న గంజాయిని తూర్పు గోదావరి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు వివరాలు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని చింతూరు పరిధిలో ఏఎస్పీ కృష్ణకాంత్‌ పర్యవేక్షణలో శనివారం పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాన్‌ను తనిఖీ చేయగా ఫర్నిచర్‌ కనిపించింది. వ్యాన్‌ను క్షుణ్ణంగా తనిఖీలు చేయగా, ఫర్నిచర్‌ అడుగున 1,500 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. దీన్ని ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి కూలీలు కాలినడకన సుకుమామిడి ప్రాంతానికి తరలించి, అక్కడి నుంచి వ్యాన్‌లో ఫర్నిచర్‌ మాటున దాచి, అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ సరుకును ఉత్తరప్రదేశ్‌లోని ముజఫరాబాద్‌కు తరలిస్తున్నట్లు తేల్చారు. నిందితులు గౌరవ్‌ రాణా (23), నౌశద్‌ (19), ఆరిఫ్‌ (23)లను అరెస్టు చేశారు. గంజాయితో పాటు, వ్యాన్, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు