రాష్ట్రాలు దాటొచ్చి.. క్లయింట్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు వెళ్తు..

21 Jul, 2021 08:09 IST|Sakshi
పర్వానీ(ఫైల్‌)

సాక్షి, గన్నేరువరం (కరీంనగర్‌): వృత్తిలో భాగంగా రాష్ట్రాలు దాటొచ్చి, క్లయింట్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు వెళ్తున్న రాజస్థాన్‌కు చెందిన ఓ న్యాయవాది రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని జూలూర్‌ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న రాజేష్‌కుమార్‌ పర్వానీ (45)కి హైదరాబాద్‌కు చెందిన గంగారాం బంధువు. గంగారాంపై శంకరపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీని విషయమై మంగళవారం ఉదయం హుజూరాబాద్‌ కోర్టులో హాజరుకావాల్సి ఉంది. ఈ కేసును రాజేష్‌ కుమార్‌ పర్వానీ వాదిస్తున్నారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగిన ఆయన తన క్లయింట్‌ గంగారాంతో కలిసి కారులో వస్తున్నారు. వీరి వాహనం గుండ్లపల్లి టోల్‌ప్లాజా వద్ద ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న రాజేష్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ కృష్ణతోపాటు, గంగారాంకు తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని చికిత్స నిమిత్తం 108లో కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. గంగారాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

కరీంనగర్‌ న్యాయవాదుల సంతాపం
గుండ్లపల్లి వద్ద మృతిచెందిన వ్యక్తి న్యాయవాది అని తెలుసుకున్న కరీంనగర్‌ న్యాయవాదులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రఘునందన్‌రావు ఆధ్వర్యంలో సీనియర్‌ న్యాయవాదులు ప్రభాకర్‌రావు,  సత్యనారాయణరావు, రాములు, మహేందర్‌రెడ్డి, శ్రీకాంత్‌ కరీంనగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. ఏసీపీ విజయసారథిని కలిసి వెంటనే పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేయించాలని కోరారు.

ఏసీపీ ఆదేశాల మేరకు సీఐ శశిధర్‌రెడ్డి, ఎస్సై తిరుపతి ఆస్పత్రికి వచ్చి పంచానామా ముగించారు. కరీంనగర్‌లో ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన  సీనియర్‌ న్యాయవాది కిరణ్‌ సింగ్‌తోపాటు న్యాయవాదులు సంపత్, శ్రీనివాస్‌లు కేసు నమోదు చేయించారు. పోస్టుమార్టం అనంతరం  మృతదేహాన్ని అంబులెన్స్‌లో రాజస్థాన్‌కు పంపించారు. వృత్తి ధర్మంలో భాగంగా రాజస్థాన్‌ నుంచి ఇక్కడికి వచ్చి, మృతిచెందడం బాధాకరమని కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అన్నారు.  

మరిన్ని వార్తలు