షాకింగ్‌ ఘటన: కారుతో ఢీకొట్టి..ఎనిమిది కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి...

22 Jan, 2023 14:30 IST|Sakshi

బిహార్‌లో వృద్ధుడిని ఢీ కొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢీ కొట్టడంతో ఆ వృద్ధుడు కారు ముందు భాగం బానెట్‌పై పడిపయాడు. అయినా ఆపకుండా ర్యాష్‌గా వెళ్లిపోయాడు కారు డ్రైవర్‌. ఆ తర్వాత సడెన్‌ బ్రేక్‌లు వేసి ఆ వృద్ధుడిని కింద పడేసి..అతడిపై నుంచే వెళ్లిపోయాడు. ఈ దారుణ ఘటన బిహార్‌లోని చంపారన్‌ జిల్లాలోని జాతీయ రహదారిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...బాంగ్రా గ్రామానికి చెందిన శంకర్‌ చౌధర్‌ అనే 70 ఏళ్ల వ్యక్తి సైకిల్‌పై వస్తున్నాడు. బాంగ్రా చౌక్‌ సమీపంలోని ఎన్‌హెచ్‌27 రహదారిని దాటుతుండగా గోపల్‌గంజ్‌ పట్టణం నుంచి వేగంగా వస్తున్న కారు అతడిని ఢీ కొట్టింది. ఈ అనుహ్య ఘటనకు ఆ వృద్ధుడు ఆ కారు బానెట్‌పై పడిపోయాడు. ఐతే ఆ కారు డ్రైవర్‌ మాత్రం కారు ఆపకుండా నిర్లక్ష్యంగా పోనిచ్చాడు. అలా ఎనిమిది కిలోమీటర్ల వరకు ఆ వృద్ధుడిని ఈడ్చుకెళ్లి..సడెన్‌ బ్రేక్‌లు వేసి కింద పడిపోయేలా చేశాడు. దీంతో ఆ వృద్ధుడు ఒక్కసారిగా కారు కింద పడిపోయాడు. ఆ డ్రైవర్‌ కాస్త కూడా వృద్ధుడని కనికరం చూపకుండా.. కారుని అతని పై నుంచి తీసుకెళ్లిపోయాడు.

దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల స్థానికులు గమనించి ఆ కారుని ఆపమని అరవడమే కాకుండా కొంతమంది ఆ కారుని వెంబడించారు. కానీ ఆ డ్రైవర్‌ ఆ స్థానికులను చూసి మరింత స్పీడ్‌గా కారుని పోనిచ్చినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందివ్వడంతో వాళ్లు ఎన్‌హెచ్‌27 రహదారి సమీపంలోని పోలీస్టేషన్లను అప్రమత్తం చేశారు.

దీంతో ఆ కారుని పిప్రకోఠి సమీపంలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఐతే ఆ కారు డ్రైవర్‌తో సహా కారులో ఉన్నవారందరూ పరరయ్యినట్లు పేర్కొన్నారు. ఆ కారు యజమానిని ట్రేస్‌ చేసి ఈ ఘటన గురించి విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఢిల్లీలోని 20 ఏళ్ల యువతి కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన తర్వాత దేశంలో ఇదేతరహాలో వరుస ఘటనలు చోటుచేసుకోవం బాధాకరం.

(చదవండి:  వృద్ధుడిపై లాఠీ ఝళిపించిన మహిళా పోలీసులు)

మరిన్ని వార్తలు