రోడ్డు ప్రమాదం: మృతదేహంతో 10 కిమీ ప్రయాణం

19 Feb, 2021 20:52 IST|Sakshi

చండీఘర్‌: పంజాబ్‌లో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ఓ కారు ఎదురుగా వస్తున్న సైకిల్‌ను ఢికోట్టింది. అనంతరం కారుపై ఎగిరి పడ్డ మృతదేహంతో దాదాపు 10 కిలో మీటర్లు ప్రయాణించిన ఘటన రాష్ట్రంలో మొహాలీలో చోటుచేసుకుంది. స్థానికుల సమచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు పంజాబ్‌లోని మోహలీకి చెందిన యోగేంద్ర మొండల్‌గా గుర్తించారు. అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు... ఫతేగర్‌ పట్టణానికి చెందిన నిందితుడు నిర్మల్‌ సింగ్‌ జిరాక్‌పూర్‌ నుంచి సన్నీ ఎన్‌క్లేవ్‌ వైపు కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో మొహాలీలోని ఎయిర్‌పోర్టు రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా సైకిల్‌పై వస్తున్న బాధితుడు యోగేంద్రను ఢీకొట్టాడు.

దీంతో అతడు గాల్లోకి ఎగిరి నిర్మల్‌ సింగ్‌ కారుపై పడ్డాడు. అయితే నిర్మల్‌ సింగ్‌ కారు ఆపకుండా మృతదేహంతోనే 10 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ క్రమంలో అతడు యోగేంద్రను హస్పీటల్‌కు తీసుకువెళ్లగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు చెప్పడంతో సన్నీ ఎన్‌క్లేవ్‌ వద్ద మృతదేహాన్ని వదిలి పరారయ్యాడు. దీనిపై మొహాలీ డీఎస్పీ రూపిందర్‌ దీప్‌ కౌర్‌ మాట్లాడుతూ.. ర్యాష్‌ డ్రైవింగ్‌ వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద స్థలంలోని సీసీ కెమెరాల ఆధారంగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. నిందితుడు నిర్మల్‌ సింగ్‌ను అరెస్టు చేసి అతడిపై ఐపీసీ సెక్షన్‌ 279, 427, 304, 201 కింద కేసు నమోదు చేసి అనంతరం అతడి కారును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు