చుట్టూ సీసీ కెమెరాలు.. కానీ కారు మాయం..!

9 Feb, 2021 08:10 IST|Sakshi

చోరీకి గురైన లగ్జరీ కారు ఇంకా దొరకని వైనం.. 

బంజారాహిల్స్‌: సిటీలోనే పేరు మోసిన ఓ స్టార్‌ హోటల్‌..చుట్టూ పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు..అడుగడుగునా సెక్యూరిటీ నిఘా. లోపలికి వెళ్లినా..బయటికి వచ్చినా క్షుణ్ణంగా తనిఖీలు. అయినా పార్కింగ్‌లో పెట్టిన ఓ కారు మాయమైంది. సరే కారు పోయింది..పోలీసులు 24 గంటలు తిరిగే సరికి పట్టుకుంటారులే అని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికీ కారు పోయి 12 రోజులు గడిచినా జాడ కానరాలేదు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉన్నా ఇప్పటి వరకు పోలీసులకు మాత్రం కారు ఆచూకీ దొరకలేదు. ఇదిలా ఉండగా అసలు ఇప్పుడు కారు ఎలా కొట్టాశారనేదానిపైనే పోలీసు వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓ వైపు టాస్క్‌ఫోర్స్, మరోవైపు క్రైం పోలీసులు ఈ కారును ఎలా దొంగిలించి ఉంటారన్నదానిపై స్కెచ్‌లు వేస్తున్నారు.

గతంలో ఇలాంటి కారు చోరీలు జరిగినప్పుడు వాటిని ఎలా ఛేదించారన్నదానిపై ఆరా తీస్తున్నారు. అయితే పార్క్‌ హయత్‌ దొంగ మాత్రం పక్కా ప్రణాళికతో ‘సినిమా’టిక్‌ గా కొట్టేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాలో ఇదే తరహాలో హీరో కారును రోల్‌జామ్‌ డివైస్‌తో కారులో ఉన్న సెన్సార్లను బయటి ఉండి రిమోట్‌తో ఆపరేట్‌ చేసి కారును కొట్టేస్తాడు... ఇదే తరహా ప్రయోగాన్ని ఓ దొంగ బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో గత నెల 26వ తేదీ రాత్రి జరిగిన దొంగతనంలో ప్రయోగించినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

వేసిన తాళం వేసినట్టే..  
బెంగళూరుకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారి వి.మంజునాథ్‌ ఓ సినిమాకు సంబంధించిన చర్చల కోసం గత నెల 22వ తేదీన హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో బస చేశాడు. 26వ తేదీన ఉదయం డ్రైవర్‌ హర్షతో కలిసి బయటికి వెళ్లి పనులు ముగించుకొని రాత్రి 9.30 గంటలకు హోటల్‌కు వచ్చాడు. డ్రైవర్‌ హర్ష పార్కింగ్‌ స్థలంలో కారును నిలిపి..తాళం వేసి..బండి ‘కీ’ని జేబులో వేసుకొని పంజగుట్టలోని తనకు కేటాయించిన లాడ్జికి వెళ్ళిపోయాడు. తెల్లవారి వచ్చి చూసేసరికి పార్కింగ్‌లో ఉండాల్సిన కారు మాయం అయింది.

దీంతో మంజునాథ్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించారు. అదే రోజు అర్ధరాత్రి ఓఆర్‌ఆర్‌ టోల్‌ప్లాజా వరకు వెళ్ళిన కారు తిరిగి వెనక్కి వచ్చినట్లుగా ఫుటేజీలో కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికి టెక్‌మహీంద్ర సమీపంలో కారు పార్కింగ్‌ చేసినట్లుగా, 28వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో అక్కడి నుంచి తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇంత వరకు ఆచూకీ దొరకలేదు. 

చదవండి: ఇప్పుడే పెళ్లి వద్దు.. నిందలు భరించలేను.. 

మరిన్ని వార్తలు