రెండేళ్లు నమ్మకంగా నటించి ముంచేశాడు

9 Apr, 2021 12:43 IST|Sakshi

కేపీహెచ్‌బీకాలనీ: వృద్ధ దంపతులకు కేర్‌టేకర్‌గా ఉంటూ ఇంట్లోని రూ.7.80 లక్షల నగదును దొంగిలించిన వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం..కేపీహెచ్‌బీకాలనీ ఫేజ్‌–5కు చెందిన సూరపనేని మోహన్‌రావు (75) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు కేర్‌ టేకర్‌గా కావాలని సైనిక్‌పురిలోని వీకేర్‌ ఏజెన్సీని సంప్రదించగా ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన మెరుగు శశికిరణ్‌ను నియమించారు. 2018 నుంచి మోహన్‌రావు ఇంట్లో పనిచేస్తున్న శశికిరణ్‌ వారితో నమ్మకంగా ఉన్నాడు. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో పాటు మద్యం, ఇతరత్రా వ్యసనాలకు బానిసైన శశికాంత్‌ కన్ను ఆ ఇంట్లో ఉన్న నగదుపై పడింది.

మార్చి 28న మధ్యాహ్నం మోహన్‌రావు నిద్రలో ఉండగా బీరువాలోని రూ.7.80 లక్షల నగదును దొంగిలించి ఏమీ తెలియనట్లుగా వివిధ కారణాలతో తాను కేర్‌టేకర్‌ బాధ్యతలను నుంచి తప్పుకుంటున్నానని, చెప్పి మార్చి 28న మరో వ్యక్తిని నియమించి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా మార్చి 30న మోహన్‌రావు సమీప బంధువు సీతారామస్వామికి డబ్బు అవసరం ఉండటంతో డబ్బు ఇచ్చేందుకు బీరువాను తెరిచి చూశాడు. బీరువాలో ఉండాల్సిన డబ్బు కనిపించలేదు. దీంతో శశికిరణ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ కేపీహెచ్‌బీ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శశికిరణ్‌ సైనిక్‌పురిలోని వీకేర్‌ ఏజెన్సీకి సమీపంలో ఉన్నట్లుగా సమాచారం అందడంతో అక్కడికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. రూ.1.05 లక్ష జల్సాకు వాడుకున్నట్లు నిందితుడు తెలిపాడు. శశికిరణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
(చదవండి: ఈ కాలేజీలో చదవలేను.. సర్టిఫికెట్లు ఇస్తే ఇంటికెళ్లిపోతాను )

మరిన్ని వార్తలు