అమర్‌రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు

18 Jul, 2021 04:17 IST|Sakshi
అమర్‌రాజా ఫ్యాక్టరీ

చెన్నై ఐఐటీ నిపుణులతో పాటు పీసీబీ అధికారులను అడ్డుకున్న నిర్వాకం

రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, తిరుపతి: జల, వాయు కాలుష్యాలను వెదజల్లుతూ కార్మికులు సహా చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్న అమర్‌రాజా ఫ్యాక్టరీ యాజమాన్యంపై పోలీసు కేసు నమోదైంది. ఆ ఫ్యాక్టరీలో కాలుష్యం శాతం ఏ మేరకు ఉందో పరిశీలించేందుకు వచ్చిన చెన్నై ఐఐటీ నిపుణులతో పాటు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులను అడ్డుకున్నందుకు గాను అమర్‌రాజా బ్యాటరీ ఇండస్ట్రీస్‌పై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలో ఉన్న అమర్‌రాజా ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యం శాతం, దాని ప్రభావాలపై ఏపీ కాలుష్య నియంత్రణ మండలి పరిశీలన చేపట్టింది.

ఈ క్రమంలో ఫ్యాక్టరీల ఎన్విరాన్‌మెంటల్‌ ఆడిటింగ్‌తో పాటు కాలుష్య శాతం ఏ మేరకు ఉందో అధ్యయనం చేయాలని చెన్నైకి చెందిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)కి కాంట్రాక్ట్‌ అప్పగించింది. ఈ నెల 3వ తేదీన చెన్నై నుంచి వచ్చిన ఐఐటీ నిపుణుల బృందం సభ్యులు ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు యత్నించారు. అయితే, ఫ్యాక్టరీ సెక్యూరిటీ సిబ్బంది ఐఐటీ నిపుణులను లోనికి అనుమతించలేదు. అమర్‌రాజా ఫ్యాక్టరీస్‌ డీజీఎంగా పనిచేస్తున్న ఎన్‌.గోపీనాథరావుకు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (పీసీబీ) తరఫున వచ్చామని చెప్పినా పట్టించుకోలేదు.

చివరకు పీసీబీ ఈఈ నరేంద్రబాబు వచ్చినా లోనికి అనుమతించలేదు. దీంతో పీసీబీ ఈఈ నరేంద్రబాబు ఈ నెల 16వ తేదీన రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌లో సదరు ఫ్యాక్టరీల నిర్వాకంపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించినందుకు గానూ కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు శనివారం తెలిపారు. 

మరిన్ని వార్తలు