అధికారిణిపై దాడి.. టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావుపై కేసు..

14 May, 2022 13:27 IST|Sakshi

సాక్షి, పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై కేసు నమోదైంది. మున్సిపల్‌ అధికారిణిపై దాడి చేసిన కేసులో పత్తిపాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతుల్లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి చెరువు వద్ద బోర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటర్‌ ప్లాంట్‌ పునఃప్రారంభం పేరుతో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళా అధికారిపై దాడికి తెగబడ్డారు.
చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులపై నోరు పారేసుకున్న చంద్రబాబు 

చిలకలూరిపేట పట్టణంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పాత మంచినీటి చెరువు కట్టపక్కన ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పథకం పేరుతో వాటర్‌ ప్లాంట్‌ను నాటి మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ ప్లాంట్‌ మనుగడలో లేదు. కానీ, దీనిని తిరిగి ప్రారంభిస్తున్నట్లు గురువారం మీడియాలో ప్రచారం చేశారు. దీనికితోడు.. పురపాలక సంఘానికి చెందిన స్థలంలో గుట్టుగా రెండు బోర్లు వేశారు. సమాచారం అందుకున్న మున్సిపల్‌ అధికారులు బోర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, అక్కడ ఎలాంటి తదుపరి చర్యలు నిర్వహించరాదని గురువారం నోటీసులు జారీచేశారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా, పత్తిపాటి తన అనుచరులు సుమారు 200మందితో ప్లాంటు వద్దకు చేరుకుని నానా రభస సృష్టించారు.

ప్లాంట్‌ ప్రారంభానికి వచ్చిన పత్తిపాటి పుల్లారావుకు మునిసిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ (టీపీఎస్‌) కోడిరెక్క సునీత, రెవెన్యూ అధికారి ఫణికుమార్, ఇతర అధికారులు బోర్లు, ప్లాంట్‌ నిర్వహణకు అనుమతుల్లేవని స్పష్టంచేశారు. అర్బన్‌ సీఐ జి. రాజేశ్వరరావు, పట్టణ ఎస్‌ఐలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. టీడీపీ నాయకులు మునిసిపల్‌ అధికారులను తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగి రభస సృష్టించారు. అంతేకాక.. మహిళ అని కూడా చూడకుండా సునీతను తోసేసి, ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమెకు భుజం, వీపు ప్రాంతంలో గట్టి దెబ్బలు తగిలాయి. 


 

మరిన్ని వార్తలు