Hyderabad: ప్రేమ పేరుతో వెంటబడి.. యువతి ఫొటోలను రహస్యంగా తీసి మార్ఫింగ్‌..

19 Dec, 2022 13:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యువతులను వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురిపై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు వివరాల ప్రకారం.. ఎర్రగడ్డలోని ఓ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని (22) ప్రాక్టికల్స్‌కు వచ్చిన సమయంలో నార్సింగ్‌కి చెందిన మహబూబ్‌ అలియాస్‌ హేమంత్‌తో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని.. పెళ్లి కూడా చేసుకుంటానని వేధించసాగాడు. ఫోన్‌లో ఆమె ఫొటోలను రహస్యంగా తీసి నగ్నంగా మార్ఫింగ్‌ చేశాడు.

తనకు రూ.3 లక్షలు ఇవ్వాలని, లేదంటే సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పాటు కుటుంబసభ్యులకు పంపుతానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బయపడిన యువతి మహబూబ్‌ అడిగిన డబ్బులు ఇచ్చింది. ఒంటిపై ఉన్న నగలు సైతం ఇవ్వమని డిమాండ్‌ చేయడంతో నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చింది. ఇటీవల ఆమె కుటుంబసభ్యులు నగలు ఎక్కడున్నాయని అడగ్గా అసలు విషయం చెప్పడంతో ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. 
బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న ఓ యువతిని మోసం చేసి రూ.8 లక్షలు స్వాహా చేశాడు ఓ వ్యక్తి. ఎస్‌ఆర్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న ఓ యువతి బ్యూటీషియన్‌గా పని చేస్తుంది. నాలుగేళ్ల క్రితం కోదాడకు చెందిన కంభంపాటి రాజేంద్రబాబు పరిచయమై ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రూ.8 లక్షలు తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతడిలో మార్పు గమనించిన యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి తప్పించుకుని తిరుగుతున్నాడు. మోసపోయినట్లు గ్రహించిన యువతి రాజేంద్రబాబుపై ఫిర్యాదు చేసింది.  

మరో ఘటనలో..  
బీకేగూడలోని హాస్టల్‌లో ఉంటున్న 23 ఏళ్ల యువతి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఎనిమిది నెలల క్రితంసూర్యాపేటకు చెందిన సుద్దాల సునీల్‌ అనే వ్యక్తి పరిచయమై వేధింపులకు పాల్పడుతున్నాడు. వేర్వేరు నంబర్లతో ఫోన్లు చేసి వేధిస్తుండటంతో అతడి నంబర్‌ను బ్లాక్‌ చేసింది. ఈ క్రమంలో ఆమెను వెంబడించి బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మరిన్ని వార్తలు