కింజరాపు వారి మైనింగ్‌ మాయ.. అచ్చెన్న ఫ్యామిలీ గ్రానైట్‌ బాగోతం 

11 Jun, 2022 10:06 IST|Sakshi
కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌లో ఉన్న వాహనం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు వారి ‘వ్యాపార రహస్యం’ బట్టబయలైంది. ఏళ్లుగా సాగుతున్న గ్రానైట్‌ బాగోతం వెలుగుచూసింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులు గ్రానైట్‌ కుంభకోణానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. కలర్‌ గ్రానైట్‌ను అక్రమ తరలించడమే కాకుండా అడ్డగోలుగా విక్రయాలు జరిపారు. ఈ మొత్తం వ్యవహారం గనుల శాఖ , విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసింది. దీనిపై పక్కా ఆధారాలతో అధికారులు కోట»ొమ్మాళి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
చదవండి: తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేదనే?.. గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతిపై సందేహాలు

కోటబొమ్మాళి మండలం పెద్ద బమ్మిడి గ్రామంలో సర్వే నంబర్‌ 106/1,104/9లో టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాదరావు కుమారుడు సురేష్‌కుమార్‌ పేరున శ్రీ దుర్గా భవానీ గ్రానైట్‌ ఇండస్ట్రీ ఉంది. 2018 ఏప్రిల్‌ 23 నుంచి 2038 ఏప్రిల్‌ 22వ తేదీ వరకు దాదాపు 20 ఏళ్ల పాటు మినరల్‌ డీలర్‌ లైసెన్స్‌ తీసుకున్నారు. దీంట్లో నాథూరాం చౌదరి, పొన్నాం దాలినాయుడు, పొన్నాం భాస్కరరావు, రావాడ మోహనరావు భాగస్వాములుగా ఉన్నారు. జిల్లాలో అనేక కలర్‌ గ్రానైట్‌ క్వారీల నుంచి గ్రానైట్‌ బ్లాక్‌లను అధికారికంగా అనుమతి తీసుకుని తమ ఇండస్ట్రీకి రవాణా చేసుకోవాల్సి ఉంది. కానీ, అచ్చెన్న కుటుంబీకులకు చెందిన ఈ ఇండస్ట్రీలో అందుకు భిన్నంగా వ్యవహారాలు నడుస్తున్నాయి.

మే 8న వచ్చిన సమాచారం మేరకు కంచిలి మండలం భైరీపురం గ్రామంలోని రానా గ్రానైట్‌ అండ్‌ మినరల్‌ క్వారీ నుంచి గ్రానైట్‌ బ్లాక్‌లను తరలిస్తున్న వాహనాన్ని(ఏపీ30టీఎ 1089) గనుల శాఖ, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేసి గడువు దాటిన పరి్మట్‌తో అక్రమంగా తరలిస్తున్నట్టుగా గుర్తించారు.

మే 8వ తేదీ మ«ధ్యాహ్నం 3.11గంటల వరకే ఉన్న పర్మిట్‌ను ఆధారంగా చేసుకుని ఆ తర్వాత గ్రానైట్‌ బ్లాక్‌ల తరలింపు చేసినట్టు నిర్ధారించారు. దీంతో సిబ్బంది స్టేట్‌మెంట్‌ తీసుకుని వాహనం సీజ్‌ చేశారు.

ఈ సందర్భంలో తమ యాజమాన్యం చెప్పినట్టుగా వాహనం బ్రేక్‌ డౌన్‌ అయిన కారణంగా ఆలస్యమైందని, దానివల్ల గడువు సమయం దాటి రవాణా చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో గనుల శాఖ, విజిలెన్స్‌ అధికారులు లోతుగా విచారణ జరిపారు.

పలాస దగ్గర ఉన్న టోల్‌ ప్లాజాలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా పట్టుకున్న ఏపీ 30టీఎ 1089వాహనం నిర్దేశిత ట్రాన్సిట్‌ గడువు సమయంలో మూడు సార్లు లోడింగ్, అన్‌లోడింగ్‌తో అటు ఇటు వెళ్లినట్టు రికార్డైంది. దీంతో ఒక ట్రాన్సిట్‌ ఫారంతో రెండు మూడు సార్లు గ్రానైట్‌ బ్లాక్‌ల అక్ర మ తరలింపు జరిగినట్టు అభిప్రాయానికొచ్చారు.

దీని వెనుక గుట్టు తేల్చేందుకు ఈ గ్రానైట్‌ బ్లాక్‌లు రవాణా జరిగిన అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన శ్రీ దుర్గా భవానీ గ్రానైట్‌ ఇండస్ట్రీని, అటు కంచిలిలో ఉన్న గ్రానైట్‌ క్వారీని పరిశీలించి, విచారణ జరిపారు. దీంతో దుర్గా భవానీ గ్రానైట్‌ ఇండస్ట్రీ బాగోతం బయటపడింది. అ«ధికారుల విచారణను దృష్టిలో ఉంచుకుని అప్పటికప్పుడు గ్రానైట్‌ బ్లాక్‌ల నంబర్లు దిద్దుబాటు చేయడం, నంబర్ల టాంపరింగ్‌కు పాల్పడటం వంటివి చేశారు. అంతేకాకుండా ఒకే నంబర్‌తో ఉన్న వివిధ గ్రానైట్‌ బ్లాక్‌లను గుర్తించారు. అలాగే, ఆన్‌లైన్‌లో ఉన్నదానికి, భౌతికంగా ఉన్న బ్లాక్‌ల నిల్వల తేడాను సైతం పట్టుకున్నారు.

172.87 క్యూబిక్‌ మీటర్ల బరువైన 23 బ్లాక్‌లకు సంబంధించి తేడాలు ఉన్నాయి. ఇవన్నీ గ్రానైట్‌ క్వారీల నుంచి అక్రమంగా తరలించినట్టుగా తేల్చారు. దీని విలువ అపరాధ రుసుంతో కలిపి రూ.6కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఇదంతా ప్రభుత్వానికి రావల్సిన ఆదాయం. దానిని అచ్చెన్న ఫ్యామిలీ వ్యూహాత్మకంగా గండి కొట్టి దోచుకుంది.

కేసు నమోదు  
అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెందిన శ్రీ దుర్గా భవానీ గ్రానైట్‌ ఇండస్ట్రీలో ప్రభుత్వ ప్రాపర్టీ దొంగతనం, టాంపరింగ్, డూప్లికేషన్, ఉన్న స్థితిని మార్చడం వంటి అక్రమాలకు పాల్పడ్డారని ఆ ఇండస్ట్రీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాదరావు కుమారుడు సురేష్‌కుమార్, భాగస్వాములైన నాథూరాం చౌదరి, పొన్నాం దాలినాయుడు, పొన్నాం భాస్కరరావు, రావాడ మోహనరావుపై కోటబొమ్మాళి పోలీసు స్టేషన్‌లో శ్రీకాకుళం గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం.బాలాజీనాయక్‌ ఫిర్యాదు చేశారు. దీంతో 379, 420, 477–ఎ, 406, 120బి, 34ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.   

మరిన్ని వార్తలు