‘పచ్చ’నేతలు దొరికారు!

29 Aug, 2020 08:36 IST|Sakshi
లంపకలోవ సొసైటీలో సిబ్బందిని విచారిస్తున్న పెద్దాపురం డీఎస్పీ శ్రీనివాసరావు

నిగ్గు తేల్చిన రెండు నెలల సుదీర్ఘ విచారణ 

లంపకలోవలో అవినీతి ఖరీదు రూ.16.48 కోట్లు

డీసీసీబీ మాజీ చైర్మన్‌ ‘రాజా’ ఇలాకాలో అవినీతి ఖజానా    

గత టీడీపీ ప్రభుత్వంలో ఐదేళ్లూ అవినీతి తమ హక్కు అన్నట్టుగా ఆ నేతలు చలాయించడంతో కోట్ల రూపాయలకు కాళ్లు వచ్చాయి. రానున్న ఐదేళ్లూ కూడా తమవే అన్న రీతిలో రెచ్చిపోవడంతో మృతులు కూడా వీరికి ఆదాయ వనరులుగా మారిపోయారు. సహకార వ్యవస్థకు తూట్లు పొడిచిన ‘పచ్చ’ నేతలు రైతులను మోసం చేశారు.

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లాలో సహకార రంగాన్ని భ్రష్టు పట్టించి కోట్లు కొట్టేసిన ప్రబుద్ధుల బండారాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. పచ్చ నేతలు పచ్చని పొలాలను పావులుగా వాడుకుని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, మృతుల పేర్లతో పాస్‌పుస్తకాలు, బినామీ ఆస్తులను కుదువ పెట్ట డం ద్వారా సహకార వ్యవస్థను అధఃపాతాళంలోకి నెట్టేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనా కాలంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ)ను లూటీ చేసేశారు. ఈ కుంభకోణాలను ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డీసీసీబీ సీఈఓ మంచాల ధర్మారావు సహా పలు బ్రాంచీల మేనేజర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులపై డీసీసీబీ చైర్మన్‌ అనంత ఉదయభాస్కర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు.

గత పాలకవర్గంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం విచారణ కు ఆదేశించి, అవినీతి కుంభకోణాల మూలాలను తవ్వి తీస్తోంది. ఈ క్రమంలో తాజాగా మెట్ట ప్రాంతంలో అప్పటి డీసీసీబీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రస్తుత ఇన్‌చార్జి వరుపుల రాజా అధ్యక్షుడిగా వ్యవహరించిన లంపకలోవ సొసైటీలో కోట్ల రూపాయల అవినీతి గుట్టును 51 విచారణ రట్టు చేసింది. ఇప్పుడైతే లంపకలోవలో అవినీతి కుంభకోణం బయట పడింది కానీ ఆ ఐదేళ్ల పాలనా కాలంలో జిల్లాలో ఏ సహకార సంఘాన్ని కదలించినా భారీగానే అక్రమాలు బయటపడుతున్నాయి. గత నెలలో ఆత్రేయపురం బ్రాంచి పరిధిలోని వద్దిపర్రు సొసైటీలో అంతా కుమ్మక్కై వ్యవసాయ కూలీలను రైతులుగా చూపించి రూ.1.50 కోట్లు కొట్టేసిన సంగతి ‘సాక్షి’ బయటపట్టిన నేపథ్యంలో పలువురిపై చర్యలు తీసుకున్నారు. 

పలు కేసుల నమోదు 
దాదాపు ఇదే రీతిన ప్రత్తిపాడు మండలం లంపకలోవ పీఏసీఎస్‌లో ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ.16 కోట్లు పైనే నొక్కేసినట్టు నిర్థారణ కావడం జిల్లా సహకారశాఖను ఒక కుదుపు కుదిపేస్తోంది. ఈ సొసైటీలో రూ.16,47,59,023 దుర్వినియోగానికి పాల్పడ్డ అప్పటి సొసైటీ అధ్యక్షుడు, నాటి డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజాతోపాటు మరో నలుగురిపై శుక్రవారం ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదవడం తీవ్ర సంచలనమైంది. రాజాతో పాటు ఇద్దరు మాజీ సీఈఓలు, మాజీ బ్రాంచి మేనేజర్లపై పెద్దాపురం డివిజనల్‌ కో ఆపరేటివ్‌ ఆఫీసర్‌  రాధాకృష్ణారావు పోలీసుల కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.  

డొంక కదిలింది ఇలా... 
లంపకలోవ సొసైటీలో 2018 మే 11 నుంచి 2019 జూలై 30 మధ్య కాలంలో నిధులు అడ్డంగా దోచేశారంటూ ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్ర ప్రసాద్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ అవినీతి డొంక కదిలింది. ఎమ్మెల్యే పర్వత శాసనసభలో ప్రస్తావించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రాథమిక విచారణలో నిధు ల దుర్వినియోగం రుజువుకావడంతో ప్రత్తిపాడు డీసీసీబీ మేనేజర్‌ ఎం.నరసింహమూర్తిని సస్పెండ్‌ చేశారు. ఈ చర్య ఎంత మాత్రం సరిపోదని, లోతైన విచారణ జరిపి ప్రతిపైసా తిరిగి సొసైటీకి జమవ్వాలని ఎమ్మెల్యే పర్వత, ఇటు డీసీసీబీ చైర్మన్‌ అనంతబాబు పట్టుబట్టి మరీ ఏపీ సహకార చట్టం 1964 ప్రకా రం 51 విచారణ జరిపించారు. ఈ అవినీతిని వెలుగులోకి తీసుకురావడానికి జిల్లా సహకార అధికారి డి.పాండురంగారావు సొసైటీ పరిధిలో 5050 మంది సభ్యులలో రుణాలు పొందిన సుమారు 4000 మంది సభ్యులను సుమారు రెండు నెలల పాటు విచారించిన మీదట నిధుల దుర్వినియోగాన్ని నిర్థారించారు.

అడ్డగోలుగా రుణాలు మంజూరు 
ఒకరి పేరునే రెండు, మూడు రుణాలు తీసుకోవడం, మృతుల పేర్ల మీద, నకిలీ పాస్‌ పుస్తకాలపైన అడ్డగోలుగా రుణాలు మంజూరు చేయడం వంటి అనేక అవకతవకలు ఈ విచారణలో వెలుగులోకి వచ్చాయి. గత నవంబర్‌ నెలలో రెవెన్యూ అధికారులు పాస్‌ పుస్తకాలను తనిఖీ చేసి, అధిక శాతం నకిలీ పట్టాదారు పాస్‌ పుస్తకాలతో రుణాలు పొందినట్టు నిర్ధారించారు. ఇదే లంపకలోవ సొసైటీలో అవకతవకలపై గత అక్టోబర్‌ నెలలో కుంభకోణంలో క్రియాశీలక పాత్ర పోషించిన డీసీసీబీ మాజీ చైర్మన్‌ వరుపుల రాజాతోపాటు సొసైటీ డైరెక్టర్లు, మాజీ సీఈఓ చాగంటి వెంకట్రావుల ఆస్థులపై జప్తు నోటీసులను కూడా జారీ చేశారు. ఇప్పుడు రాజాతోపాటు ఈ కుంభకోణ బాధ్యులుపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

వరుపుల రాజాతో పాటు నలుగురిపై కేసులు
ప్రత్తిపాడు: మండలంలోని లంపకలోవ వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో నిధుల అవకతవకలపై అప్పటి సొసైటీ అధ్యక్షుడు, మాజీ డీసీసీబీ చైర్మన్‌ వరుపుల రాజాతోపాటు మరో నలుగురిపై శుక్రవారం ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. స్థానిక పోలీసుల కథనం మేరకు లంపకలోవ సొసైటీలో 2018 మే 11–2019 జూలై 30 మధ్య కాలంలో తప్పుడు లెక్కలు నమోదు చేయడం, అవకతవకలకు పాల్పడి రూ.16,47,59,023 నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని పెద్దాపురం డివిజన్‌ కోఆపరేటివ్‌ అధికారి ఎ. రాధాకృష్ణారావు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు అప్పటి లంపకలోవ సొసైటీ అధ్యక్షుడు, మాజీ డీసీసీబీ చైర్మన్‌ వరుపుల జోగిరాజు అనే రాజా, సొసైటీ మాజీ సీఈఓ సీహెచ్‌ వెంకట్రావు, సీఈఓ కె.అప్పారావు, ప్రత్తిపాడు డీసీసీబీ మాజీ బ్రాంచ్‌ మేనేజర్లు ఎం.నరసింహమూర్తి, పి.మురళీకృష్ణలపై 409, 419, 420, 468, 471, 477(ఎ), 109 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడు సీఐ వై.రాంబాబు ఆధ్వర్యంలో ఏఎస్సై సత్యనారాయణ కేసు నమోదు చేశారు. పెద్దాపురం డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం లంపకలోవ సొసైటీలో విచారణ చేపట్టారు. ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐలు వై.రాంబాబు, సురేష్, సొసైటీ అధ్యక్షుడు గొంతిన సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా