మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

9 Dec, 2020 05:53 IST|Sakshi

దుండిగల్‌: ఓ భూవివాదంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్‌ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్‌ ఠాణాలో ఆరో తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తల్లి పద్మావతి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, మంత్రితో పాటు ఆయన కుమారుడు, వారి అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని పద్మావతి కుమార్తె శ్యామలాదేవి హైకోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. బాధితురాలు శ్యామలాదేవి ఫిర్యాదు ప్రకారం... తల్లి పొన్నబోయిన పద్మావతి పేరుపై సూరారం సర్వే నంబర్‌ 115, 116, 117లలో 2.13 ఎకరాల భూమి ఉంది.

ఈ భూమిని విక్రయించాలంటూ మంత్రి తన అనుచరులతో బెదిరించారు. దీనిపై 2017లో పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. దీంతో తల్లి పద్మావతితో కలిసి కోర్టులో మల్లారెడ్డిపై భూవివాదానికి సంబంధించిన పిటిషన్‌ వేసేందుకు న్యాయవాది లక్ష్మీనారాయణను ఆశ్రయించారు. అయితే మంత్రితో చేతులు కలిపిన న్యాయవాది లక్ష్మీనారాయణ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసేందుకని బాధితులనుంచి స్టాంప్‌ పేపర్‌పై సంతకాలు తీసుకున్నాడు. వాటి ఆధారంగా మల్లారెడ్డి అనుచరుడు గూడూరు మస్తాన్‌కు ఆ భూమిని అమ్మేందుకు రూ.ఎనిమిది లక్షలతో అగ్రిమెంట్‌ చేసుకున్నట్టుగా నకిలీ అగ్రిమెంట్‌ పేపర్లను తయారు చేశారు. దీన్ని అడ్డుపెట్టుకొని పద్మావతి, శ్యామలాదేవిలను ఆ భూమిలోకి రానివ్వలేదు.

ఈ ఒత్తిడులు ఇలా ఉన్న సమయంలోనే కొన్ని నెలల క్రితం శ్యామలాదేవి తల్లి పద్మావతి, సోదరి మరణించారు. దీంతో ఒంటరిగా ఉన్న తనకు ప్రాణహాని ఉందంటూ, మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్యామలాదేవి దుండిగల్‌ పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయలేదు. దీంతో కోర్టులో శ్యామలాదేవి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

మరిన్ని వార్తలు