పవన్, కారు డ్రైవర్‌పై కేసు నమోదు 

13 Nov, 2022 04:41 IST|Sakshi
విశాఖలో శుక్రవారం రాత్రి మోదీని సన్మానించి నమస్కరిస్తున్న పవన్, విశాఖ బీచ్‌లో పవన్‌ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్‌

బాధ్యతారహితంగా కారు నడిపారని బాధితుడి ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, విశాఖపట్నం/తాడేపల్లిరూరల్‌/కొమ్మాది (భీమిలి): జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, ఆయన కారు డ్రైవర్‌పై తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 5వ తేదీన ఉదయం గుంటూరు జిల్లా తెనాలి మారీస్‌పేటకు చెందిన శివకుమార్‌ ఇప్పటం నుంచి బైక్‌పై బైపాస్‌ రోడ్‌కు వస్తున్నారు.

అదే సమయంలో పవన్‌కళ్యాణ్‌ కారుపై కూర్చుని ఉండగా.. కొంతమంది ఆ కారుకు వేలాడుతూ ఇప్పటం వైపు దూసుకొచ్చారు. దీంతో శివకుమార్‌ కిందపడిపోయాడు. పవన్‌కళ్యాణ్, ఆయన డ్రైవర్‌ రాష్‌ డ్రైవింగ్‌ కారణంగా తనకు ప్రమాదం జరిగిందంటూ శుక్రవారం శివకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాడేపల్లి పోలీసులు ఐపీసీ 336, రెడ్‌ విత్‌ 171, 279/ఎంబీ కింద కేసు నమోదు చేశారు.  

రుషికొండ పనులను పరిశీలించిన పవన్‌: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ తీర ప్రాంతంలో పర్యటించారు. ముందుగా రామానాయుడు స్టూడియో ఎదురుగా ఉన్న బీచ్‌లో నాదెండ్ల మనోహర్‌తో కలిసి కొద్దిసేపు విహరించారు. అక్కడకు వచ్చిన మత్స్యకారులతో మాట్లాడారు.

అనంతరం రుషికొండలో గల కొండపై జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వెళ్లారు. కొండ చుట్టూ బారికేడ్లు ఉండటంతో బయట నుంచే కొండపై జరుగుతున్న పనులను పరిశీలించారు. అయితే ఎవరికి సమాచారం లేకుండా పవన్‌ వెళ్లడం చర్చనీయాంశమైంది.

పార్టీ ఇన్‌చార్జిలతో పవన్‌ భేటీ: జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ శనివారం పార్టీ ఇన్‌చార్జిలతో సమావేశమయ్యారు. విశాఖ నగరంలో తాను బస చేసిన హోటల్లో ఆయన వీరితో కాసేపు సమీక్షించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన, తనతో భేటీ తదితర అంశాలను చర్చించారు.

భవిష్యత్తు ప్రణాళికపై త్వరలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా, విజయనగరం శివారు గుంకలాంలోని వైఎస్సార్‌ జగనన్న కాలనీలోని ఇళ్లను ఆదివారం పవన్‌ పరిశీలించనున్నారు. 

మరిన్ని వార్తలు