ప్రభుత్వం కూల్చేందుకు భారీ కుట్ర? జార్ఖండ్‌లో కలకలం

24 Jul, 2021 20:43 IST|Sakshi

రాంచీ: ఓ స్టార్‌ హోటల్‌లో ముగ్గురు పోలీసులకు చిక్కడం జార్ఖండ్‌లో కలకలం రేపుతోంది. తమ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు కుట్ర పన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వారి అరెస్ట్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. రాష్ట్ర రాజధాని రాంచీలో ఈ సంఘటన జరిగింది. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వెనకున్న వారిని బయటకు లాగుతామని, ఆ కుట్రను బహిర్గతం చేస్తామని హెచ్చరించారు.

రాంచీలోని ఓ హోటల్‌లో మూడు రోజుల నుంచి ఆ హోటల్‌లో పెద్ద ఎత్తున ఓ కార్యకలాపాలు జరుగుతున్నాయని ప్రభుత్వ నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ కుట్ర విషయమై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కుమార్‌ జై మంగల్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఈ దాడులు జరపగా ముగ్గురు అరెస్టయ్యారు. దీనిపై విచారణ చేపట్టి సోదాలు చేయగా  అభిషేక్‌ దుబే, అమిత్‌ సింగ్‌, నివారణ్‌ ప్రసాద్‌ మహతో పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదు పట్టుకున్నారని సమాచారం. అదుపులోకి తీసుకున్న వారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు అధికార పార్టీ ఆరోపించింది.

ప్రస్తుతం జార్ఖండ్‌లో జార్ఖండ్‌ ముక్తి మోర్చ (జేఎంఎం), కాంగ్రెస్‌, రాష్ట్రీయ జనతా దల్‌ (ఆర్జేడీ) కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా హేమంత్‌ సోరేన్‌ ఉన్నారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 81 స్థానాలు ఉన్న జార్ఖండ్‌లో జేఎంఎం (30), కాంగ్రెస్‌ (18), ఆర్జేడీ (1)లకు మొత్తం కలిపి 47 స్థానాలు వచ్చాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే హోటల్‌లో ఓ రహాస్య కుట్రకు తెరతీశారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. 
 

మరిన్ని వార్తలు