అవకతవకలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై కేసులు

13 May, 2021 05:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అక్రమాలు పునరావృతమైతే అరెస్టులు

విజిలెన్స్‌ డీజీ రాజేంద్రనాథ్‌రెడ్డి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవకతవకలకు పాల్పడిన 9 ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్‌లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లు మంగళ, బుధవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15 ఆస్పత్రుల్లో సోదాలు నిర్వహించాయి. ఇందుకు సంబంధించిన వివరాలను విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ) కేవీఎన్‌ రాజేంద్రనాథ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల తనిఖీల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన రోగులకు చికిత్స చేయడానికి నిరాకరించడం, ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే అధిక చార్జీల వసూలు, పేషెంట్ల సంఖ్యపై తప్పుడు సమాచారం, రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల దుర్వినియోగం, అనుమతి లేకుండా కోవిడ్‌ చికిత్స వంటి అవకతవకలను గుర్తించినట్టు డీజీ వివరించారు.

విశాఖపట్నంలోని రమ్య ఆస్పత్రి, విశాఖ జిల్లా నీరుకొండలోని అనిల్‌ నీరుకొండ(ఎన్‌ఆర్‌ఐ భీమిలి), గోపాలపట్నంలోని ఎస్‌ఆర్‌ ఆస్పత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని చైత్ర, విజయవాడలోని అచ్యుత ఎన్‌క్లేవ్, శ్రీరామ్, గుంటూరులోని విశ్వాస్‌ ఆస్పత్రి, చిత్తూరు జిల్లా పీలేరులో డాక్టర్‌ ప్రసాద్, అనంతపురంలోని ఆశా ఆస్పత్రిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్టు వివరించారు. వాటిపై ఐపీసీ 188, 420, 269 సెక్షన్లు, విపత్తుల నిర్వహణ చట్టంలోని 51(ఎ), 51(బి), 53 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసినట్టు రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఫ్‌లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌లు ఏర్పాటు చేసిన తరువాత ఇప్పటివరకు నిర్వహించిన దాడుల్లో అక్రమాలకు పాల్పడిన 37 ఆస్పత్రులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు. సోదాల్లో అవకతవకలు వెలుగుచూసిన ఆస్పత్రులకు జరిమానా, పనిష్మెంట్‌ ఇచ్చి వైద్య, ఆరోగ్య శాఖ పునరుద్ధరించినప్పటికీ ఆవే ఆస్పత్రులు మళ్లీ అక్రమాలకు పాల్పడితే వాటి యాజమాన్యాలను అరెస్ట్‌ చేయడానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు