నగదు ఇస్తే గవర్నర్‌ పదవి !

26 Jul, 2022 01:09 IST|Sakshi

పలు పదవులకు రూ.100 కోట్లు

వసూలు చేసేందుకు ముఠా స్కెచ్‌

భగ్నం చేసిన సీబీఐ

న్యూఢిల్లీ: భారీ స్థాయిలో నగదు ముట్టజెప్తే రాష్ట్ర గవర్నర్‌ పదవి, రాజ్యసభ సభ్యునిగా ఎంపికయ్యేలా చేస్తామని పలు పదవులు ఎరచూపిన ఒక ముఠా గుట్టును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) రట్టుచేసింది.  మొత్తంగా రూ.100 కోట్ల మేర నగదు వసూళ్లకు ఈ ముఠా  ప్రణాళిక సిద్ధంచేసుకుందని సీబీఐ తెలిపింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఈ కేసుకు సంబంధించి సీబీఐ ఇటీవల పలు చోట్ల దాడులు చేపట్టింది.

ఈ ముఠాకు సంబంధించి మహా రాష్ట్రలోని లాతూర్‌లో కమలాకర్‌ ప్రేమ్‌కుమార్‌ బంద్గర్, కర్ణాటకలోని బెల్గామ్‌లో రవీంద్ర విఠల్‌ నాయక్‌ను, ఢిల్లీలో మహేంద్ర పాల్‌ అరోరా, అభిషేక్‌ బోరాలను సీబీఐ అరెస్ట్‌చేసింది. ముఠాలో ముఖ్యుడైన కమలాకర్‌ మిగతావారితో కలిసి పలువురు వ్యక్తులకు పదవులు ఇప్పిస్తామని ఆశచూపాడని సీబీఐ కేసులు పెట్టింది. గవర్నర్‌ పదవి, రాజ్యసభ సభ్యునిగా ఎంపిక, కేంద్ర ప్రభుత్వ సంస్థల చైర్మన్‌ పదవులు ఇప్పిస్తామని పలువురు ప్రముఖులను ఈ ముఠా సంప్రదించింది. పలు కేసుల దర్యాప్తు తమకు అనుకూలంగా సాగాలంటూ పోలీసులనూ కమలాకర్‌ బెదిరించాడని పేర్కొంది. అరెస్ట్‌ అయిన అందరికీ సీబీఐ  కోర్టు బెయిల్‌ మంజూరుచేయడం గమనార్హం. 

మరిన్ని వార్తలు