రూ.11 కోట్ల చిల్లర మాయం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం

19 Aug, 2022 05:09 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో కరౌలీ జిల్లాలోని స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) మెహందీపూర్‌ శాఖలో రూ.11 కోట్ల విలువైన చిల్లర నాణేల మాయంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు  25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలీ, అల్వార్, ఉదయ్‌పూర్, భిల్వారా తదితర ప్రాంతాల్లో బ్యాంకు మాజీ అధికారులకు, ఇతరులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేపట్టారు.

ఎస్‌బీఐ మెహందీపూర్‌ బ్రాంచ్‌లో రూ.11 కోట్ల విలువైన చిల్లర మాయమయ్యింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దర్యాప్తు సక్రమంగా ముందుకు సాగకపోవడంతో అధికారులు రాజస్తాన్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. కరౌలీ ఎస్‌బీఐ శాఖలో రూ.13 కోట్ల విలువైన నాణేలు ఉండాలి. లెక్కించగా, కేవలం రూ.2 కోట్ల విలువైన నాణేలు మిగిలాయి. నాణేలు లెక్కించేందుకు వచ్చిన ప్రైవేట్‌ సిబ్బందిని కొందరు వ్యక్తులు బెదిరించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు