హథ్రాస్‌ కేసు: కీలక పరిణామం

18 Dec, 2020 15:06 IST|Sakshi
బాధితురాలిని దహనం చేసిన స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు(ఫైల్‌ ఫొటో)

హథ్రాస్‌ కేసు: చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హథ్రాస్‌ దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆమెను చిత్రహింసలకు గురిచేసి మృతికి కారణమైన వారిపై, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, సామూహిక అత్యాచారం కింద అభియోగాలు నమోదు చేసింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు స్థానిక కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కాగా ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆమె నాలుక కోసి, వెన్నుముక విరిచి అత్యంత పాశవికంగా దాడి చేశారు. (చదవండి: కాలేజీ క్లర్కుతో ఎఫైర్‌: 21 ఏళ్లుగా..)

దీంతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. కాగా తల్లితో కలిసి గడ్డి కోస్తున్న సమయంలో మెడకు దుపట్టా బిగించి లాక్కెళ్లి బాధితురాలిని చిత్ర హింసలకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక బాధితురాలి అత్యంత దయనీయ పరిస్థితిలో మరణించడం, మృతదేహానికి పోలీసులే అర్ధరాత్రి అంత్యక్రియలు నిర్వహించడం వంటి పరిణామాలు పలు అనుమానాలకు తావిచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సెప్టెంబరు 30న యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు ఈ కేసు విచారణకై తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆ తర్వాత సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణను అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తోంది. 

మరిన్ని వార్తలు