అభిషేక్‌ బెనర్జీ భార్య, మరదలికి సీబీఐ నోటీసు

22 Feb, 2021 04:30 IST|Sakshi
అభిషేక్‌ బెనర్జీ, ఆయన భార్య రుజీరా బెనర్జీ

బొగ్గు దొంగతనం కేసులో విచారణకు సహకరించాలని ఆదేశం

బీజేపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆగ్రహం

పశువుల స్మగ్లింగ్‌ కేసులో అభిషేక్‌ మిత్రుడికి సమన్లు  

న్యూఢిల్లీ/కోల్‌కతా: త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్న పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీకి, మరదలు మేనకా గంభీర్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదివారం నోటీసు జారీ చేసింది. బొగ్గు అక్రమ తవ్వకం, దొంగతనం కేసులో విచారణకు సహకరించాలని పేర్కొంది. సీబీఐ బృందం కోల్‌కతాలోని అభిషేక్‌ బెనర్జీ భార్య, మరదలి నివాసాలకు వెళ్లి, నోటీసు అందజేసింది. పశ్చిమ బెంగాల్‌లో కునుస్తోరియా, కజోరా ప్రాంతాల్లోని ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌కు(ఈసీఎల్‌) చెందిన బొగ్గు గనుల్లో బొగ్గును అక్రమంగా తవ్వుకొని, స్వాహా చేశారని ఆరోపిస్తూ సీబీఐ గత ఏడాది నవంబర్‌లో పలువురిపై కేసు నమోదు చేసింది. నిందితుల్లో ఈసీఎల్‌ జనరల్‌ మేనేజర్, చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ ఇన్‌చార్జి తదితరులు ఉన్నారు. ఈ వ్యవహారంతో రుజీరా బెనర్జీకి, మేనకా గంభీర్‌కు కూడా సంబంధం ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. విచారణకు సహకరించాలంటూ తాజాగా నోటీసు జారీ చేసింది. సోమవారం విచారించే అవకాశం ఉందని, ఈ కేసుకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొంది. అలాగే పశువుల స్మగ్లింగ్‌ కేసులో అభిషేక్‌ బెనర్జీకి సన్నిహితుడైన వినయ్‌ మిశ్రాకు సీబీఐ సమన్లు జారీ చేసింది.

బీజేపీకి లొంగే ప్రసక్తే లేదు
తన భార్యకు సీబీఐ నోటీసు ఇవ్వడం పట్ల అభిషేక్‌ బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. కేసులతో తమను బెదిరించలేరని బీజేపీ పెద్దలను హెచ్చరించారు. బీజేపీకి లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బెంగాల్‌ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. బీజేపీ నుంచి మిత్రపక్షాలన్నీ దూరమయ్యాయని, ఇప్పుడు సీబీఐ, ఈడీ మాత్రమే బీజేపీ కూటమిలో ఉన్నాయని విమర్శించింది. బొగ్గు దొంగతనం కేసులో సీబీఐ విచారణను తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్గీయా ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, తప్పు చేసిన వారు ఎంతటివారైనా శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చిచెప్పారు. 

మరిన్ని వార్తలు