లేఖను ఎందుకు దాచారు? 

17 May, 2023 03:15 IST|Sakshi

హత్య జరిగాక ఎవరెవరికి ఫోన్‌ చేశారు? 

వైఎస్‌ వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖరరెడ్డిని ప్రశ్నించిన సీబీఐ 

వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి నోటీసులు 

19న విచారణకు రావాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌/పులివెందుల: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఆయన కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డిలను మంగళవారం ప్రశ్నించారు. వివేకా మరణించే ముందు రాసినట్టుగా చెబుతున్న లేఖ గురించే వారిద్దరి నుంచి ఎక్కువగా వివరాలు రాబట్టినట్టు సమాచారం. సీబీఐ నోటీసుల మేరకు సునీత, రాజశేఖరరెడ్డి హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో హాజరయ్యారు.

వివేకా హత్య తర్వాత జరిగిన పరిణామాలతోపాటు లేఖను ఎందుకు దాచిపెట్టాల్సి వచ్చింది?, తర్వాత పోలీసులకు అందించడం, వివేకా పీఏ కృష్ణారెడ్డికి హత్య జరిగిన రోజు ఎన్నిసార్లు ఫోన్లు చేశారు? ఆయన నుంచి ఎన్ని ఫోన్‌ కాల్స్‌ అందుకున్నారు? హత్య జరిగిన సమా­చారం అందిన తర్వాత ఎవరెవరితో మాట్లాడారు? ఇలా పలు అంశాలపై సునీత, రాజశేఖరరెడ్డిలను సీబీఐ అధికారులు మరోమారు సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఇద్దరి స్టేట్‌మెంట్లను సీబీఐ అధికారులు నమోదు చేశారు.  

విచారణకు హాజరుకాని అవినాష్‌ 
కాగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16న మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని 15వ తేదీన ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాను ముందుగా నిర్ణయించుకున్న పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేనని.. నాలుగు రోజుల గడువు కావాలని లేఖ ద్వారా అవినాష్‌ రెడ్డి సీబీఐ అధికారులకు తెలియజేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని ఆయన ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అక్కడ ఎంపీ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో వారి డ్రైవర్‌కు నోటీసులు అందజేసి అతడి సంతకం తీసుకున్నారు. అవినా‹Ùరెడ్డి ఈ నెల 19న ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.   

ప్రత్యేక కేటగిరీగా పరిగణించి వసతులు కల్పించండి: భాస్కరరెడ్డి పిటిషన్‌ 
జైలులో తనకు ప్రత్యేక కేటగిరీ కింద సదుపాయాలు కల్పించాలని కోరుతూ వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడు (ఏ–7) వైఎస్‌ భాస్కరరెడ్డి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయనను గత నెలలో సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తన అనారోగ్యాన్ని, వయసును దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ భాస్కరరెడ్డి పిటిషన్‌ వేశారు. దీనిపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. వాదనలు విన్న కోర్టు తన ఉత్తర్వులను జూన్‌ 2కు వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు