శివకుమార్‌పై సీబీఐ కేసు

6 Oct, 2020 01:51 IST|Sakshi

కర్ణాటక పీసీసీ చీఫ్‌ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు 

రూ.74.93 కోట్ల ఆస్తులు అక్రమంగా ఆర్జించారని ఆరోపణ 

న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారంటూ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్‌ పార్టీ ట్రబుల్‌ షూటర్‌ మాజీ మంత్రి డీకే శివకుమార్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం కేసు నమోదు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో శివకుమార్‌కు చెందిన 14 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ.57 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌కు చెందిన రెండు నివాసాల్లోనూ(బెంగళూరు, ఢిల్లీ) సోదాలు నిర్వహించారు. డీకే శివకుమార్‌ గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు రూ.74.93 కోట్ల విలువైన ఆస్తులు అక్రమంగా సంపాదించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇవన్నీ ఆయన పేరిట, కుటుంబ సభ్యుల పేరిట ఉన్నాయని చెబుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఏడు నెలల క్రితం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా కేసు నమోదు చేసింది.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ ప్రతినిధి ఆర్‌కే గౌర్‌ చెప్పారు. మనీ లాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గతంలోనే డీకే శివకుమార్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  డీకే శివకుమార్‌పై సీబీఐ కేసు పెట్టడాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై ఉద్దేశపూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. కర్ణాటకలో నవంబర్‌ 3వ తేదీన రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీని దెబ్బతీయడానికే డీకే శివకుమార్‌పై కేసు పెట్టారని విమర్శించింది. మోదీ, యడ్యూరప్ప ద్వయం చేతుల్లో సీబీఐ కీలుబొమ్మగా మారిపోయిందని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా మండిపడ్డారు. డీకే శివకుమార్‌ సీబీఐకి సహకరించి, తన నిజాయితీని నిరూపించుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి హితవు పలికారు. రూ.వందల కోట్ల ఆస్తులను అతి తక్కువ కాలంలో ఎలా ఆర్జించారో చెప్పాలన్నారు.   
 

మరిన్ని వార్తలు