యరపతినేని నివాసాల్లో సీబీఐ దాడులు

20 Nov, 2020 04:40 IST|Sakshi

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని, అనుచరుల నివాసాల్లో సోదాలు

పలు కీలక పత్రాలు, మొబైల్‌ ఫోన్లు, సామగ్రి, నగదు స్వాధీనం

శాటిలైట్‌ చిత్రాలతో నష్టం అంచనా  

సాక్షి, అమరావతి/దాచేపల్లి(గురజాల): టీడీపీ పాలనలో అక్రమ మైనింగ్‌కు పాల్పడిన టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఆయన అనుచరుల నివాసాలపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) గురువారం మెరుపు దాడులు చేసింది. తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు గుంటూరు జిల్లా గురజాల, పిడుగురాళ్ల, నడికుడి, నారాయణపురం, కేసానుపల్లి తదితర 25 ప్రాంతాల్లోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు జరిపింది. దీనికి సంబంధించిన వివరాలను సీబీఐ ఢిల్లీ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. తాము జరిపిన సోదాల్లో అనేక ఆధారాలతో పాటు  పలు కీలక పత్రాలు, మొబైల్‌ ఫోన్లు, సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.     

17 కేసులపై దర్యాప్తు..
టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు సహా ఆయన అనుచరులు 17 మంది సాగించిన అక్రమ సున్నపురాయి తవ్వకాలపై నమోదైన 17 కేసులపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. గుంటూరు జిల్లా దాచేపల్లి, పిడుగురాళ్ల మండలాల్లోని కేసానుపల్లి, నడికుడి, కోనంకి గ్రామాల పరిధిలో నిందితులు అక్రమ మైనింగ్, క్వారీ తవ్వకాలు, విలువైన సున్నపురాయిని మోసపూరితంగా తరలించడం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. పెద్ద ఎత్తున సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారు. 2014 నుంచి 2018 వరకు అనేక లక్షల టన్నుల సున్నపురాయిని అక్రమంగా తవ్వేశారు. మొత్తంగా అనేక కోట్ల రూపాయల మేర విలువైన సహజ వనరులు దోచుకున్నారు. ఈ వ్యవహారంపై వేగంగా దర్యాపు చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది.

శాటిలైట్‌ చిత్రాలతో నష్టం అంచనా..
అక్రమ మైనింగ్‌ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. నష్టం అంచనా వేయడానికి దేశంలోనే తొలిసారిగా శాటిలైట్‌ చిత్రాలను ఉపయోగించుకుంటోంది. అక్రమ మైనింగ్‌కు ముందు, ఆ తర్వాత.. శాటిలైట్‌ చిత్రాలను తీసుకొని వాటిని సాంకేతిక పద్ధతుల్లో పరిశీలించి ఏ మేరకు అక్రమ మైనింగ్‌ చేశారనే దానిని సీబీఐ అంచనా వేస్తోంది. కాగా, సీబీఐ అధికారులు వచ్చారన్న విషయం తెలుసుకున్న కొందరు నిందితులు పరారైనట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయమున్న వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా