మూడో రోజూ ఆయుధాల కోసం గాలింపు

10 Aug, 2021 04:15 IST|Sakshi
ఆయుధాల కోసం వంకలో గాలిస్తున్న మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు

 అయినా లభించని ఆధారాలు 

పులివెందుల : మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయుధాల కోసం పులివెందులలో సీబీఐ బృందం మూడోరోజు సోమవారం కూడా గాలించింది. ఉదయం పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి గుడి వెనుక ఉన్న వంక బ్రిడ్జి కింద బురదను వెలికితీశారు. అలాగే, హత్య తర్వాత నిందితులు రక్తపు మరకల దుస్తులు వేశారన్న సమాచారంతో ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న గరండాల్‌ బ్రిడ్జి కింద కూడా జేసీబీతో గాలింపు చేపట్టారు. అయితే, సాయంత్రం వరకు రెండుచోట్లా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గాలింపును మంగళవారానికి వాయిదా వేశారు.

ఇక సోమవారం ఉదయం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులతో వివేకా కుమార్తె సునీత కాసేపు సమావేశమయ్యారు. అలాగే, పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌ వల్లెపు వరప్రసాద్, ఎర్రంరెడ్డిపల్లె జగదీశ్వరరెడ్డి, రాజారెడ్డి ఆసుపత్రి సిబ్బంది శ్రీనివాసులరెడ్డి, సీఎస్‌ఐ చర్చికి సంబంధించిన శిఖామణి, సంపత్, నీలయ్య, సుధాకర్, దినేష్‌ నర్సింగ్‌ హోం మెడికల్‌ స్టోర్‌ సిబ్బంది ఓబులేసు, రామకృష్ణారెడ్డి, యూసీఐఎల్‌ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి, కాంపౌండర్‌ ప్రకాష్‌రెడ్డి, మాజీ లెక్చరర్‌ చంద్రశేఖరరెడ్డిలను సీబీఐ బృందం విచారించింది.

వివేకా ఇంటి వద్దకు సునీల్‌ యాదవ్‌ 
వివేకా హత్యకేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌ను సోమవారం సాయంత్రం సీబీఐ అధికారులు వైఎస్‌ వివేకా ఇంటి వద్దకు తెచ్చి, అక్కడ ఫొటోలు తీసుకున్నట్లు తెలిసింది. అతడిని ఇంటి పరిసర ప్రాంతాల్లోని ఇరువైపులా ఉన్న రోడ్లపై వాహనంలోనే ఉంచి తిప్పారు. 

మరిన్ని వార్తలు