‘తెలుగు అకాడమీ’ కేసులో మరొకరి అరెస్టు 

20 Oct, 2021 02:06 IST|Sakshi
కృష్ణారెడ్డి 

కీలకంగా వ్యవహరించిన నిజాంపేటవాసి కృష్ణారెడ్డి  

కుంభకోణం సొమ్ము నుంచి ఇతడికి భారీగా వాటా 

విజయవాడ సీసీఎస్‌లోనూ రెండు కేసులు 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు అకాడమీ నిధుల కుంభకోణం కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. అకాడమీకి సంబంధించిన రూ.64.5 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కాజేసిన కేసులో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌(సీసీఎస్‌) పోలీసులు మరో నిందితుడు జీవీ కృష్ణారెడ్డిని మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 16 మంది అరెస్టయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూరుకు చెందిన కృష్ణారెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌ నిజాంపేటలో నివసిస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నేపథ్యంలోనే మూడేళ్ల క్రితం సాయికుమార్‌తో అతడికి పరిచయం ఏర్పడింది.

తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల సొమ్ము కాజేయడానికి సాయి ఏడాది క్రితం పథకం వేయగా దీనికి సహకరించడానికి కృష్ణారెడ్డి ముందుకు వచ్చాడు. క్రమేణా కృష్ణారెడ్డితో ఎక్కువ అవసరం లేకపోవడాన్ని గమనించిన సాయికుమార్‌ అతడిని దూరంగా ఉంచాడు. అయితే ప్రతి అక్రమ లావాదేవీ నుంచి అతడికి వాటా ఇస్తూనే వచ్చాడు. సాయి అరెస్టు తర్వాత కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. విచారణలో సాయి ఈ విషయాలను వెల్లడించడంతో ఏసీపీ కె.మనోజ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం కృష్ణారెడ్డి కోసం ముమ్మరంగా గాలించింది.

ఎట్టకేలకు మంగళవారం అతడిని అరెస్టు చేసింది. కుంభకోణం సొమ్ము నుంచి అతడి వాటాగా రూ.6 కోట్ల వరకు ఇచ్చానంటూ సాయి పోలీసులకు చెప్పగా, తనకు  రూ.2.65 కోట్లు మాత్రమే అందాయని కృష్ణారెడ్డి అంటున్నాడు. ఈ విషయంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. కృష్ణారెడ్డిని కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. 

ఏపీలోనూ నేరాలు 
దాదాపు పుష్కరకాలంగా కుంభకోణాలకు పాల్పడుతున్న సాయికుమార్‌ ముఠా ఆంధ్రప్రదేశ్‌లోని రెండు సంస్థల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లనూ కొల్లగొట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన రూ.10 కోట్లు, ఏపీ ఆయిల్‌ అండ్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌కు చెందిన రూ.5 కోట్లను ఇదే పంథాలో స్వాహా చేసింది. తెలుగు అకాడమీ కేసులో అరెస్టు అయిన సాయి ఈ విషయాలను విచారణలో బయటపెట్టాడు.

దీనిపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌ అధికారులకు సమాచారం అందించగా విజయవాడ సీసీఎస్‌లో రెండు కేసులు నమోదు చేశారు. వీటిలోనూ కృష్ణారెడ్డి నిందితుడిగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి కేసుల్లో అరెస్టులు, కస్టడీలు పూర్తయిన తర్వాత సాయి, కృష్ణారెడ్డిసహా ఇతర నిందితులను విజయవాడ పోలీసులు పీటీ వారంట్‌పై అక్కడకు తరలించి విచారించే అవకాశముంది.    

మరిన్ని వార్తలు