రాసలీలల సీడీ కేసులో కీలక పరిణామం..

26 Mar, 2021 20:57 IST|Sakshi

బెంగళూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక మాజీ మంత్రి రమేష్‌ జర్కిహోళి రాసలీలల వీడియో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీడీలో ఉన్న యువతి జర్కిహోళిపై బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. తన న్యాయవాది ద్వారా పోలీసులను ఆ‍శ్రయించిన ఆమె, తనకు ప్రాణభయం ఉందని, కావున రక్షణ కల్పించాలని కోరింది. న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో కబ్బన్‌ పార్కు పోలీస్‌ స్టేషనులో జర్కిహోళిపై ఐపీసీ సెక్షన్లు 376సీ, 354ఏ, 504, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

ఈ విషయం గురించి యువతి తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘సీడీ యువతి ఫేస్‌బుక్‌ ద్వారా మమ్మల్ని ఆశ్రయించింది. తనకు చట్టపరమైన సాయం చేస్తామని హామీ ఇచ్చాం. దీంతో కంప్లెంట్‌ రాసి మాకు పంపించింది. ఈ విషయాన్ని మేం కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లాం. ఆమెకు భద్రత కల్పించాలని, న్యాయం చేయాలని, ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం’’ అని పేర్కొన్నారు. 

కాగా రాసలీలల సీడీ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సీడీలో కనిపించిన యువతి సహా, ఇతర అనుమానితులు ఇంకా పరారీలో ఉన్నారు. దీంతో సిట్‌ విచారణ తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా యువతి ఫిర్యాదు నేపథ్యంలో రమేష్‌ జర్కిహోళి కోర్టును ఆశ్రయించి, యాంటిసిపేటరి బెయిలు తెచ్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తనకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలంటూ యువతి ఇది వరకే ఓ వీడియో విడుదల చేసింది. ఈ మేరకు హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మైకి సందేశం పంపించింది.  

చదవండి: రాసలీలల కేసు: 10 సీడీలు వచ్చినా భయపడను 

మరిన్ని వార్తలు