సలాహుద్దీన్‌.. భత్కల్‌ సోదరులు..

28 Oct, 2020 02:34 IST|Sakshi
సలాహుద్దీన్, రియాజ్‌ భత్కల్‌ , ఇక్బాల్‌ భత్కల్‌

18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం పీచమణిచే చర్యల్లో భాగంగా మరో 18 మంది వ్యక్తులను మంగళవారం కేంద్రప్రభుత్వం ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీరిలో నిషేధిత హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్, ఇండియన్‌ ముజాహిదీన్‌ వ్యవస్థాపకులు భత్కల్‌ సోదరులు, మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు చోటా షకీల్‌ ఉన్నారు. దీంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాల (సవరణ) చట్టం (యూఏపీఏ) కింద కేంద్రం ఉగ్రవాదులుగా ప్రకటించిన వారి సంఖ్య 31కు చేరుకుంది. తాజా జాబితాలో 1999లో ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని హైజాక్‌ చేసిన అబ్దుల్‌ రవూఫ్‌ అస్ఘర్, ఇబ్రహీం అథర్, యూసఫ్‌ అజార్, ముంబై ఉగ్రదాడుల సూత్రధారుల్లో ఒకడు, పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ సాజిద్‌ మిర్, అదే సంస్థ కమాండర్‌ యూసఫ్‌ ముజమ్మిల్‌ తదితరుల పేర్లున్నాయి. ఇదే ఘటనకు సంబంధించి జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ ముగ్గురు సోదరులు అబ్దుల్‌ రవూఫ్‌ అస్ఘర్, ఇబ్రహీం అఖ్తర్, యూసఫ్‌ అజార్‌లను ఉగ్రవాదులుగా ప్రకటించింది. నిషేధిత హిజ్బుల్‌ ముజాహిదీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలాహుద్దీన్‌ అలియాస్‌ సయ్యద్‌ మొహమ్మద్‌ యూసఫ్‌ షా, డిప్యూటీ చీఫ్‌ గులాం నబీ ఖాన్‌ అలియాస్‌ అమిర్‌ ఖాన్‌లను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించింది.

భత్కల్‌ సోదరులు..
ఇండియన్‌ ముజాహిదీన్‌ అనే ఉగ్రసంస్థను ఏర్పాటు చేసిన రియాజ్‌ ఇస్మాయిల్‌ షాబంద్రి అలియాస్‌ రియాజ్‌ భత్కల్, అతని సోదరుడు  ఇక్బాల్‌ భత్కల్‌ పేర్లు ఉన్నాయి. వీరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (2010), జమా మసీదు (2010), షీతల్‌ఘాట్‌ (2010), ముంబై (2011)ల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. వీరిపై జైపూర్‌ (2008), ఢిల్లీ (2008), అహ్మదాబాద్, సూరత్‌ (2008)ల్లో వరుస పేలుళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

దావూద్‌ అనుచరులు నలుగురు..
అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించిన దావూద్‌ ఇబ్రహీం నలుగురు ముఖ్య అనుచరులు చోటా షకీల్, మొహమ్మద్‌ అనిస్‌ షేక్, టైగర్‌ మెమన్, జావెద్‌ చిక్నా పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. యూఏపీఏ అమల్లోకి వచ్చాక కేంద్రం 2019 సెప్టెంబర్‌లో నలుగురిని, 2020 జూలైలో 9 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఇప్పటికే ఉగ్రముద్ర పడిన వారిలో జైషే మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్, ముంబై ఉగ్రదాడి నిందితుడు జకీ ఉర్‌ రహ్మాన్‌ లఖ్వి, మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, ఖలిస్తాన్‌ కమాండో ఫోర్స్‌ చీఫ్‌ పరంజీత్‌ సింగ్‌ పన్వర్, బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషన్‌ చీఫ్‌ వాధవా బబ్బర్‌ తదితరులు ఉన్నారు.   

మరిన్ని వార్తలు