చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ కేసులో ట్విస్ట్.. ఆర్మీ జవాన్ అరెస్టు

25 Sep, 2022 15:57 IST|Sakshi

చండీగఢ్‌: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్‌ కేసుకు సంబంధించి ఆర్మీ జవాన్‌ సంజీవ్‌ సింగ్‌ను శనివారం అరెస్టు చేశారు మొహాలీ పోలీసులు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఇతను వీడియో లీక్ చేసిన విద్యార్థినిని  బ్లాక్‌మెయిల్ చేశాడని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన డిజిటల్, ఫోరెన్సిక్ ఆధారాలు లభించిన తర్వతే సంజీవ్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. ఇందుకు అరుణాచల్ పోలీసులు సహకరించినట్లు పేర్కొన్నారు. 

ఆర్మీ అధికారులు కూడా సంజీవ్‌ సింగ్‌ అరెస్టును ధ్రువీకరించారు. ఈ కేసుతో అతనికి సంబంధం ఉందని ఆధారాలు లభించిన తర్వాత పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్‌ పోలీసులకు తాము సహకరించామని పేర్కొన్నారు. విచారణలో మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. సంజీవ్ సింగ్ అరెస్టుతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లయింది.

మరోవైపు చండీగఢ్ వీడియో లీక్ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని పంజాబ్, హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణకు ధర్మాసనం తేదీని నిర్ణయించాల్సి ఉంది.

చండీగఢ్ యూనివర్సీటీలో 60 మంది అమ్మాయిలు బాత్‌రూంలో స్నానం చేసే వీడియోలు లీక్ అయ్యాయని కొద్ది రోజుల క్రితం వార్తలు రావడం దుమారం రేపింది. అయితే విచారణలో ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీక్ అయినట్లు తేలిందని పోలీసులు తెలిపారు. అది కూడా ఆ అమ్మాయే స్వయంగా తన వీడియోను రికార్డు చేసుకుని బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని చెప్పారు.
చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్‌..? స్పందించిన యూనివర్సిటీ

మరిన్ని వార్తలు