తెలీదు.. గుర్తులేదు అంటూ సీఐడీకి సహకరించని చంద్రబాబు

24 Sep, 2023 02:22 IST|Sakshi
రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో చంద్రబాబును విచారించి తిరిగి వెళ్తున్న సీఐడీ సిబ్బంది

తొలిరోజు సీఐడీ సూటి ప్రశ్నలు.. సహకరించని చంద్రబాబు

సమాధానాల దాటవేతకే ప్రాధాన్యం

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో బాబును విచారించిన సీఐడీ

పత్రాల పరిశీలన నెపంతో చంద్రబాబు కాలహరణం.. అయినా సంయమనంతో సిట్‌ బృందం విచారణ

తొలిరోజు 30 శాతం ప్రశ్నావళే పూర్తి

నేడూ కొనసాగనున్న విచారణ

సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణం కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు తొలిరోజు శనివారం విచారించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయన్ని రెండ్రోజుల సీఐడీ కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమ­తించిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు అధికారి ధనుంజయ నేతృత్వంలో సిట్‌ బృందం చంద్రబాబును సెంట్రల్‌ జైలులోనే కస్టడీ­లోకి తీసుకుని విచారించింది.

న్యాయస్థానం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఆయన్ను విచారించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గతంలో సిట్‌ కార్యాల­యంలో జరిగిన విచారణలో చెప్పినట్లుగానే ‘నాకు తెలీదు.. గుర్తులేదు’.. అంటూ సమాధా­నాలు దాటవేసేందుకే చంద్రబాబు ప్రయత్నించినట్లు తెలిసింది. పక్కా పన్నాగంతో తొలి­రోజు విచారణలో ఆయన దాదాపు సగం సమయం వృథా అయ్యేటట్లు చేయగలిగారు.

దాంతోపాటు సిట్‌ అధికారుల ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకే ఆయన ప్రాధాన్యమి­చ్చారు. రెండ్రోజుల కస్టడీ సమయాన్ని వీలైనంత వరకు వృథా చేయా­లన్నదే చంద్రబాబు ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ సిట్‌ అధికారులు పూర్తి సంయమనం, ఓపికతో వ్యవహరించి తొలిరోజు విచారణ ప్రక్రియను పూర్తిచేశారు. సమీపం నుంచి పరిశీలించేందుకు చంద్రబాబు న్యాయవాదులను అనుమతించారు. విచారణ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్‌ చేశారు. 

ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు కాలహరణం..
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులోని స్నేహ బ్లాక్‌కు సమీపంలోని కాన్ఫరెన్స్‌ హాలులో సిట్‌ అధికారులు చంద్రబాబును విచారించారు. అందుకోసం ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతోపాటు మొత్తం 12 మందితో కూడిన సిట్‌ బృందం శనివారం ఉ.9.30 గంటలకు సెంట్రల్‌ జైలుకు చేరుకుంది. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం విచారణ ప్రక్రియను ప్రారంభించారు.

అంతకుముందు.. తనను కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల కాపీ కావాలని చంద్రబాబు అడిగారు. 20 పేజీల ఆ కాపీని అధికారులు ఆయనకిచ్చారు. దానిని చదివే నెపంతో చంద్రబాబు చాలాసేపు కాలహరణం చేశారు. అయినప్పటికీ సిట్‌ అధికారులు ఓపిగ్గా వేచి చూసి ఆయన సరే అన్నాకే విచారణ ప్రక్రియను ప్రారంభించారు. 

ప్రశ్నావళిలో 30 శాతమే తొలిరోజు..
ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో వెల్లడైన కీలక ఆధారాల ప్రాతిపదికగా రూపొందించిన ప్రశ్నావళిని అనుసరించి సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో సిట్‌ కార్యాలయంలో జరిగిన విచారణలో చెప్పినట్టుగానే ‘నాకు తెలీదు.. గుర్తులేదు’.. అంటూ సమాధానాలు దాటవేసేందుకే చంద్రబాబు ప్రయత్నించారు. కొన్ని ప్రశ్నలకు అవి సంబంధిత అధికారులను అడగాలిగానీ తనను కాదని వ్యాఖ్యానించారని సమాచారం.

కీలక పత్రాలను ఆయన ముందుంచి మరీ వాటిపై ప్రశ్నించినా సరే ఆయన సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. విచారణకు చంద్రబాబు ఏమాత్రం సహకరించకపోవడంతో ప్రశ్నావళిలోని 30 శాతం ప్రశ్నలను కూడా సీఐడీ అధికారులు అడగలేకపోయారు. రెండ్రోజుల కస్టడీ సమయాన్ని వీలైనంత వరకు వృథా చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశమన్నది స్పష్టమైంది.

అయినప్పటికీ అధికారులు పూర్తి సహనంతో వ్యవహరించి తమ ప్రశ్నలను కొనసాగించారు. ప్రతి గంటకూ ఐదు నిముషాల పాటు విరామం ఇవ్వడంతోపాటు చంద్రబాబు కోరిన అదనపు సమయాల్లోనూ విచారణ ప్రక్రియను నిలుపుదల చేశారు. గంటసేపు మధ్యాహ్న భోజన విరామం ఇచ్చారు. అలా తొలిరోజు నాలుగు దశల్లో విచారించారు. అనంతరం.. చంద్రబాబు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావుల సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని స్నేహబ్లాక్‌కు తరలించారు. 

కట్టుదిట్టమైన భద్రత..
చంద్రబాబు కస్టడీ విచారణ సందర్భంగా సెంట్రల్‌ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. జైలు లోపల, బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 మంది ఆక్టోపస్, సివిల్‌ పోలీసు బృందాలను మొహరించారు. తొలిరోజు విచారణ ముగిసిన అనంతరం సిట్‌ బృందం ఫైళ్లు, వీడియో రికార్డింగ్‌ సామగ్రి మొత్తం తీసుకుని ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహానికి చేరుకుంది. 

మీడియాపై బాలకృష్ణ చిందులు..
మరోవైపు.. నందమూరి బాలకృష్ణ తన నైజాన్ని ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లపై చిందులు తొక్కారు. రాజమహేంద్రవరం విద్యానగర్‌లోని లోకేశ్‌ క్యాంప్‌ ఆఫీసు వద్ద శనివారం పార్టీ నేతలతో మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న విలేకరులు, ఫొటోగ్రాఫర్లపై ఆయన మండిపడ్డారు. క్యాంప్‌ వద్ద ఉన్న ఈనాడు ఫొటోగ్రాఫర్‌పై ఆయన తీవ్రస్థాయిలో చిందులు తొక్కారు. తాను ఈనాడు ఫొటోగ్రాఫర్‌నని ఆయన చెబితే.. ‘అయితే ఏంటి బొక్కా..’ అంటూ బాలకృష్ణ అసభ్యకరంగా మాట్లాడటం అందరినీ విస్మయపరిచింది. 

మరిన్ని వార్తలు